ప‌వ‌న్ చెప్పింది చేస్తే…కూట‌మిలో తిరుగుబాటే!

డిప్యూటీ సీఎం పవ‌న్‌క‌ల్యాణ్ ఒక్కోసారి ఆవేశంలో సినిమా డైలాగ్‌లు చెబుతుంటారు. ప‌వ‌న్ ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం అరుదు.

డిప్యూటీ సీఎం పవ‌న్‌క‌ల్యాణ్ ఒక్కోసారి ఆవేశంలో సినిమా డైలాగ్‌లు చెబుతుంటారు. ప‌వ‌న్ ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం అరుదు. మాట‌ల‌కే ప‌రిమితం అవుతుంటార‌ని ఆయ‌న‌పై ప్ర‌ధాన విమ‌ర్శ‌. అప్పుడ‌ప్పుడు తాను కూడా కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి అనే సంగ‌తి మ‌రిచిపోయి మాట్లాడుతుంటారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ‌ర్వాలేదే అని జ‌నం అనుకునే లోపు, మ‌ళ్లీ ఆ ఊసే ఉండ‌దు. క‌ర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసు ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం. అధికారంలోకి వ‌చ్చి ఏడాది స‌మీపిస్తున్నా, ఇంత వ‌ర‌కూ ఆ కేసు అతీగ‌తీ లేదు.

తాజాగా ఆయ‌న భూదందాలు, క‌బ్జాల‌పై సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్యం ఏర్ప‌డింది. జ‌న‌సేన కార్యాల‌యానికి భూక‌బ్జాలు, త‌ప్పుడు ద‌స్తావేజులు సృష్టించి స్థలాల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని చూస్తున్నారంటూ అర్జీలు వెళ్లాయి. వాటిపై ఆయ‌న అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్షించారు. తానే స్వ‌యంగా జిల్లా కేంద్రాల‌కు వ‌స్తాన‌ని, అర్జీలు స్వీక‌రిస్తాన‌ని చెప్పారు.

మొద‌ట కాకినాడ‌, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ల‌తో క‌లిసి అర్జీలు స్వీక‌రిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. అంతేకాదు, భూదందాలు, క‌బ్జాల‌కు పాల్ప‌డిన వాళ్ల‌లో కూట‌మి నేత‌లున్నా స‌రే స‌హించే ప్ర‌శ్నే లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకునే భూదందాలు, దోపిడీలు, రెవెన్యూ రికార్డుల్ని మార్చేసి, సామాన్య ప్ర‌జ‌ల్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న సంగ‌తి అందరికీ తెలుసు. గ‌తంలో ఒక స్థాయిలో జ‌రిగితే, ఇప్పుడు రెట్టింపైంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్త‌శుద్ధితో భూదందాలు చేసేవాళ్ల‌పై ఉక్కుపాదం మోపితే, కూట‌మిలో తిరుగుబాటు ఖాయం. ఎందుకంటే, అధికారం వుండేది దోచుకోడానికే అనే భావ‌న‌లో నాయ‌కులున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు దోచుకోకుంటే, ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చులు ఎలా పెట్టాల‌ని ప్ర‌శ్నించే ప‌రిస్థితి. స‌క‌ల అవ‌ల‌క్ష‌ణాల‌కు అధికార‌మే కార‌ణం. ఈ వాస్త‌వం తెలిసే ప‌వ‌న్ మాట్లాడుతున్నారా? లేదా? అనేదే ఇప్పుడు చ‌ర్చ‌.

కాకినాడ ఎమ్మెల్యేపై షిప్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ్ర‌హం చేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచి టీడీపీ నాయ‌కుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కాకినాడ రూర‌ల్ నుంచి పంతం నానాజీ అనే జ‌న‌సేన నాయ‌కుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్లిద్ద‌రిపై కూడా తీవ్ర ఆరోప‌ణ‌లున్నాయి. కాకినాడ‌కు వెళ్లి, అర్జీలు స్వీక‌రిస్తే, కూట‌మినేత‌ల‌పైనే వ‌స్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తే, రియాక్ష‌న్ ఏంటో ప‌వ‌న్‌కు తెలుస్తుంది. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌లు ఆచ‌ర‌ణ‌లో పెడితే , ఆ నిమిష‌మే ఆయ‌న‌పై తిరుగుబాటు ఖాయ‌మ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “ప‌వ‌న్ చెప్పింది చేస్తే…కూట‌మిలో తిరుగుబాటే!”

  1. …అప్పుడు ప్రభుత్వం కుప్పకూలి పోయి మళ్ళీ ఎన్నికలు వస్తే అన్నీయ్య సీఎం అయ్యి,అవినాష్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ అయ్యి.. రోజా హోమ్ మినిస్టర్ అయ్యి.ఎం 175 కి కనీసం 170 గెలిచి..మూడు రాజధానులు బిల్ అసెంబ్లీలో పెట్టి,మండలి రద్దు చేసి ..ఈ తీర్మానాలు కేంద్రం కి  ..పంపి మోడీ మెడలు వంచి… అబ్బా..ఈ వీకెండ్ ఊహలు ..నిజమైతే ఎంత బావుణ్ణు.. 🙂

Comments are closed.