టాలీవుడ్ తనను ఎంతగానో ఆదరించిందంటూ తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఆనందపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న తనను ఒకట్రెండు సినిమాలతోనే టాలీవుడ్ అక్కున చేర్చుకోవడంపై ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. టాలీవుడ్లో వచ్చినంత గుర్తింపు కోలీవుడ్ ఇవ్వలేదని ఆమె చెప్పడం విశేషం.
ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలో నటి వరలక్ష్మి అడుగు పెట్టారు. హీరోయిన్గా, తాజాగా విలన్‌గా కూడా ఆమె ఆకట్టుకుంటున్నారు. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’తో టాలీవుడ్లో ఈ అందగత్తె ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం ‘క్రాక్’,‘నాంది’లతో టాలీవుడ్‌కి మరింత చేరువయ్యారు. తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువ గుర్తింపు రావడంతో వరలక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. ఈ నేపథ్యంలో ‘నాంది’ సినిమాపై వరలక్ష్మి స్పందన ఏంటంటే..
‘ కోలీవుడ్‌లో తొమ్మిదేళ్లగా నటిస్తున్నాను. కానీ తెలుగులో నాకు లభించినంత ఆదరణ కోలీవుడ్‌లో రాలేదు. నా సినిమాలు చూసి తెలుగులో మీకు మంచి అవకాశాలొస్తాయని చాలామంది చెప్పేవాళ్లు. ఇక్కడికి వచ్చాక అది నిజమని అర్థమైంది. ‘నాంది’లో నటించే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. ఇటీవల చెన్నైకి వెళ్లినపుడు అమ్మతో కలిసి ‘నాంది’ చిత్రాన్ని చూశాం.
ఆ సినిమా చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను కథానాయికగా నటించిన ‘తారై తప్పట్టై’ అనే తమిళ చిత్రం తర్వాత మా అమ్మ కన్నీళ్లు పెట్టుకున్న చిత్రమిదే’ అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. మొత్తానికి టాలీవుడ్ ఆదరణకు వరలక్ష్మి ఫిదా అయ్యారని ఆమె మాటలను బట్టి అర్థం చేసుకోవాలి.