ఈ మధ్యన టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ పోటీలు పెరిగాయి. గతంలో దిల్ రాజు తో భాగస్వామిగా వున్న లక్ష్మణ్ కొన్నేళ్ల క్రితం వేరు కుంపటి పెట్టారు. నిర్మాణ రంగంలోకి, పంపిణీ రంగంలోకి తనంతట తాను విస్తరించాలని ఇన్నాళ్లూ ప్లానింగ్ లో వున్నారు. నైజాంలో ఇప్పటికే కొన్ని సినిమాలు కొన్నారు. దీంతో పాటు ఇప్పుడు విశాఖలో కూడా అడుగేసారు.
గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర సినిమా మార్కెట్ బాగా విస్తరించింది. సీడెడ్ ను దాటే స్టేజ్ లో వుంది. కొన్నాళ్లకు నైజాం దరిదాపుల్లోకి చేరుకుంటుందని అంచనా. ఉత్తరాంధ్రలో లోకల్ ప్లేయర్లు చాలా మంది వున్నారు. అలాగే టాలీవుడ్ జనాలు కూడా వున్నారు. కానీ దిల్ రాజు మాత్రమే ముందు చూపుతో ముఫై వరకు థియేటర్లు సంపాదించి, అక్కడ పట్టు నిలబెట్టుకున్నారు. నైజాం ను వైజాగ్ ను ముడిపెట్టి ఆయన సినిమాలు కొంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో లక్ష్మణ్ ఇప్పుడు వైజాగ్ లో ఆఫీస్ స్టార్ట్ చేసారు. జాతిరత్నాలు సినిమాతో ఆయన ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ ప్రారంభిస్తున్నారు. దాని తరువాత టక్ జగదీష్ కూడా వుండనే వుంది. సురేష్ సంస్థ మాజీ ఉద్యోగి రామ్ మోహన్ కు విశాఖ ఆఫీసు బాధ్యతలు అప్పగించారు.
ఇకపై నిర్మాతలకు కాస్త గట్టిగా బేరం ఆడే అవకాశం దొరుకుతోంది అనుకోవాలి. నైజాంలో వరంగల్ శ్రీను, లక్ష్మణ్, విశాఖలో లక్ష్మణ్ వంటి వాళ్లు ఆక్టివ్ కావడంతో సినిమాల హక్కులు తక్కువకే ఇచ్చేయాల్సిన అగత్యం నిర్మాతలకు ఇక తప్పే అవకాశం వుంది.