Appudo Ippudo Eppudo Review: మూవీ రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

ప్రధమార్ధం షార్ట్ ఫిల్మ్ లాంటి కథ గ్రాండ్ స్కేల్లో సాగి, పసలేని ఇంటర్వల్ సీన్ తో ఆగింది. ద్వితీయార్ధంలో కూడా మార్పేమీ లేదు. అదే పసలేని తనం.

చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
రేటింగ్: 1.5/5
నటీనటులు: నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాన్ష కౌశిక్, అజయ్, వైవా హర్ష, జాన్ విజయ్ తదితరులు
కెమెరా: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: సన్నీ ఎమ్మార్
నిర్మాత: బి.వి.ఎస్.ఎస్ ప్రసాద్
దర్శకత్వం: సుధీర్ వర్మ
విడుదల తేదీ: 8 నవంబర్ 2024

ఏ హడావిడి లేకుండా, ఎటువంటీ పబ్లిసిటీ ఈవెంట్లు జరుపుకోకుండా, కేవలం ఇంటర్వ్యూలతో జనాన్ని పలకరించి థియేటర్లలోకి వచ్చిన చిత్రం ఇది. నిఖిల్ హీరో అయినప్పటికీ బజ్ లేదు. ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. ఇంతకీ ఇందులో ఏముందో తెలుసుకుందాం.

రిషి (నిఖిల్) ఇండియాలో ఉండగా తార (రుక్మిణి వసంత్) ని ప్రేమిస్తాడు. తర్వాత లండన్ కి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తులసి (దివ్యాన్షి) ని తారసపడతాడు. ప్రమాదంలో ఉన్న ఆమెను కాపాడి ఆశ్రయమిస్తాడు. క్రమంగా ఆమెకు దగ్గరై పెళ్లిదాకా వెళ్తాడు. సరిగ్గా పెళ్లి టైం కి ఆమె హ్యాండిస్తుంది. ఈ లోగా బద్రి (జాన్ విజయ్) అనే డాన్ వందలాది కోట్లు ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే డివైజ్ పోగొట్టుకుంటాడు. అది రిషి దగ్గర ఉందని అతనికి అనుమానమొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కథ.

అసలీ కథ ద్వారా దర్శకుడు కొత్తగా చెప్పదలచుకున్నది ఏంటో తెలీదు. ఎక్కడా ఆసక్తి గొలిపే సంఘటన కానీ, తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్సుకత కానీ కలగవు. అసలు కథకి కొసరుగా సత్య-సుదర్శన్ ట్రాక్ తగిలించి 6 నెలల క్రితం అని కాసేపు, రెండేళ్ల క్రితం జరిగిన విషయమని కొంతసేపూ ఫ్లాష్ బ్యాకులు చెప్పడంతో స్క్రీన్ ప్లే మొదలవుతుంది. ఇలా గందరగోళంగా ఏ ట్రాక్ ఎప్పుడు జరిగిందో తెలీక “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అని టైటిల్ పెట్టినట్టుంది.

తొలి సినిమా “స్వామి రారా”తో హిట్టు కొట్టి అలాంటి మరో హిట్టు కోసం ఎదురు చూస్తున్న సుధీర్ వర్మ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం…”లేదు” అనే చెప్పాలి. కథ, కథనం, సంభాషణలు ఏవీ గ్రిప్పింగ్ గా లేవు.

సన్నీ ఎమ్మార్ “స్వామి రారా”కి ఆ రోజుల్లో ఆసక్తికరమైన సంగీతాన్ని అందించాడు. కానీ తర్వాత ఇంతటి పోటీ నడుమ తన ఉనికిని చాటుకునేంత గొప్ప సంగీతాన్ని అందించలేకపోయాడు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దయనీయంగా ఉంది. అసలే నీరసంగా ఉన్న కథనానికి గ్లుకోజ్ ఇచ్చి లేపాల్సింది పోయి చావుదెబ్బ కొట్టింది. పాట ఒక్కటే వినపడింది..”తారని కలుసుకున్నా” అనే డల్ లిరిక్స్ తో. అది కూడా బ్యాడే.

“కార్తికేయ” లాంటి నేషనల్ హిట్ తో తన ప్రెజెన్స్ చూపించుకున్న నిఖిల్ ఈ చిత్రం ఎందుకు చేసాడో కూడా అర్ధం కాదు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్టేదో ఉందని అనుకున్నా ఎన్నో సినిమాలు చూసేసిన ప్రేక్షకులకి అదేమీ అద్భుతమనిపించే ట్విస్ట్ అనిపించుకోదు.

కన్నడ డబ్బింగ్ చిత్రం “సప్తసాగరాలు దాటి” చిత్రంలో హీరోయిన్ గా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రతిభ గల నటి రుక్మిణి వసంత్. ఇందులో తన ట్యాలెంట్ చూపడానికి స్కోపేమీ లేదు. అస్సలు గ్రావిటీ లేని క్యారక్టర్ ఆమెది.

దివ్యాన్షి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నెగటివ్ షేడ్ లో బాగానే పర్ఫాం చేసింది.

సత్య ఉన్నాడనే కానీ ఉపయోగం లేకుండాపోయింది. సుదర్శన్ కూడా అంతే. ఈ ఇద్దరూ కథని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడానికి, వినడానికి తప్ప దేనికీ పనికిరాలేదు. ఒక్క జోక్ కూడా పేలలేదు.

వైవా హర్ష బలవంతపు సో కాల్డ్ కామెడీతో విసిగించాడు. జాన్ విజయ్ పాత్ర ఆ చిరాకుని ఇంకాస్త పెంచింది. విలన్ సైడ్ కిక్ గా అజయ్ ఓకే.

ప్రధమార్ధం షార్ట్ ఫిల్మ్ లాంటి కథ గ్రాండ్ స్కేల్లో సాగి, పసలేని ఇంటర్వల్ సీన్ తో ఆగింది. ద్వితీయార్ధంలో కూడా మార్పేమీ లేదు. అదే పసలేని తనం.

ఈ సినిమాలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింటేంటంటే నిడివి. చక్కగా 2 గంటల్లో కథ ముగిసింది.

చివరిగా చెప్పేదేంటంటే నిఖిల్ ని నమ్ముకుని సినిమా కొస్తే అది మన తప్పే అని అర్ధమవుతుంది. అసలీ సినినాకి పబ్లిసిటీ ఎందుకు గట్టిగా చేయలేదు అంటే వాళ్లకి ముందే నమ్మకం లేకేమో అనే అభిప్రాయం బలపడుతుంది. సినిమా మొదలైన పావుగంటకే తేడా ఉందని అనుభవమవుతుంటుంది. అప్పుడో ఇప్పుడో కనీసం ఒక్క ట్రాకన్నా ఆసక్తికరంగా ఉంటుందేమో అని వేచి చూసే ప్రేక్షకులకి ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అన్న ఫీలింగే తప్ప మరొకటి కలగదు. ఎప్పుడో రాసుకున్న పాతచింతకాయ కథని అంతే పాత పద్ధతిలో తెరకెక్కించిన చిత్రం ఈ “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో”.

బాటం లైన్: ఎప్పుడైతే ఏంటి?

4 Replies to “Appudo Ippudo Eppudo Review: మూవీ రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో”

Comments are closed.