Maa Nanna Superhero Review: మూవీ రివ్యూ: మా నాన్న సూపర్ హీరో

కొడుకు తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి నానా కష్టాలు పడడం, తండ్రి తన కొడుకు గౌరవాన్ని నిలబెట్టడానికి కొడుకు ఫారిన్ లో ఉన్నాడని అబద్ధమాడడం మానవసంబంధాల విలువని చెబుతాయి.

చిత్రం: మా నాన్న సూపర్ హీరో
రేటింగ్: 2.5/5
తారాగణం: సుధీర్ బాబు, సాయిచంద్, సయజీ షిండే, ఆమని, దేవీ ప్రసాద్, జెమిని సురేష్, రాజు సుందరం తదితరులు
కెమెరా: సమీర్ కళ్యాణి
ఎడిటింగ్: అనీల్ కుమార్
సంగీతం: జై క్రిష్
నిర్మాత: సునీల్ బులుసు
దర్శకత్వం: అభిలాష్ కంకర
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2024

సుధీర్ బాబు హీరోగా చిత్రమంటే కమర్షియాలిటీకి పూర్తి దూరంగా అయితే ఉండదనేది ఒక అభిప్రాయం. ట్రైలర్లో కూడా ఎంతో కొంత కమర్షియల్ టచ్ తో తెరకెక్కినట్టు అనిపించింది. టైటిల్ ని బట్టి ఇది సెంటిమెంట్ సినిమా అని కూడా అనిపిస్తుంది. ఇంతకీ ఇందులో ఏముందో చూద్దాం.

ప్రకాష్ (సాయిచంద్) తల్లిలేని తన పసిబిడ్డని ఒక అనాధశరణాలయంలో మూడు రోజుల పాటు మాత్రమే ఉంచమని చెప్తాడు. దానికి కారణం అతనికొక పని దొరకడం, వేరే ఊరు వెళ్లాల్సి రావడం. మూడు రొజుల్లో పని ముగించుకుని వచ్చి కొడుకుని తీసుకెళ్తానని వివరిస్తాడు ఆ అనాధశరణాలయం యాజమాన్యానికి. కానీ అనుకోకుండా గంజాయి కేసులో ఇరుక్కుని ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతాడు. తండ్రి తిరిగిరాలేదు కనుక ఆ బిడ్డకి జానీ అని పేరు పెడుతుంది ఆ శరణాలయం కేర్ టేకర్ (ఝాన్సీ).

జానీని ఒక జంట (సయాజీ షిండే, ఆమని దత్తత తీసుకుంటారు). ఆ తర్వాతే ఆ జంటకి కష్టాలు మొదలవుతాయి. షేర్ మార్కెట్లో సర్వం కోల్పోయిన పెంచిన తండ్రి, క్యాన్సర్ తో ప్రాణాలు విడిచిన పెంచిన తల్లి! షేర్ మార్కెట్లో నష్టపోవడమే కాకుండా లోకల్ రాజకీయ నాయకుడికి టార్గెట్ అవుతాడు అతను. ఆ నాయకుడు అతన్ని జైల్లో పెట్టి కొట్టిస్తాడు కూడా. పెంచిన తండ్రి మీద ప్రేమతో అతనిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు జానీ.

ఆ సందర్భంలో పెంచిన తండ్రికి కొడుకంటే అసహ్యం మొదలవుతుంది. అతని నష్టజాతకం వల్లే తనకి ఆ గతి పట్టింది అనుకుంటాడు. జానీ కష్టాలన్నీ డబ్బుతో ముడిపడినవే. కోటి ఇస్తే ఆ నాయకుడు తన తండ్రిని వదిలేస్తాడు. ఇదిలా ఉండగా అసలు తండ్రి ప్రకాష్ జైలు నుంచి విడుదలవుతాడు. అతనికి కోటిన్నర లాటరీ తగులుతుంది. అక్కడి నుంచి కథ ఏ మలుపులు తీసుకుంటుంది అనేది కథనం.

ఇది ప్రధానంగా మూడు పాత్రల మధ్యన జరిగే ఎమోషనల్ స్టోరీ. అందులోనూ ఎక్కువగా జానీ, ప్రకాష్ ల మధ్యన జరిగే సన్నివేశాలే కీలకంగా నిలిచాయి.

మానవసంబంధాలు సెంట్రిక్ గా సినిమాలు తీయాలంటే కాస్తంత ఆలోచించాల్సిన కాలమిది. ఈ మధ్యన “సత్యం సుందరం” వచ్చి చాలా మనసుల్ని తాకింది. అలా ఏ రకమైన కృత్రిమ హంగులూ లేకుండా కేవలం హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేస్తూ ఆడియన్స్ ని కూర్చోబెట్టడం ఈ రోజుల్లో కష్టమైన పని.

పెద్దగా సెంటిమెంట్ సినిమాలంటే పడని వాళ్లకి కూడా ఎంతో కొంత ఈ చిత్రం కదిలిస్తుంది. బలవంతమైన సెంటిమెంట్ సీన్లు కాకుండా, ఒక అర్ధవంతమైన కథ.. అందులో కన్న తండ్రి, పెంచిన తండ్రి, ఒక కొడుకు మధ్యన చోటు చేసుకున్న భావొద్వేగ సంఘర్షణలతో రాసుకున్న కథ.

ఎంత సహజత్వానికి దగ్గరగా తీసే ప్రయత్నం చేసినా రాజు సుందరం తో ఒక అవసరం లేని ట్రాక్ పెట్టారు. కొనసాగింపుగా ఒక పెళ్లిపాట కూడా జొప్పించారు. ఆడియన్స్ కి రిలీఫ్ అనుకున్నారేమో తెలీదు కానీ, మెయిన్ స్టోరీ నుంచి డీవియేట్ అయినట్టు అనిపిస్తుంది ఈ బ్లాక్. పైగా సుధీర్ బాబు పాత్రకి ఆ సమయంలో ఉన్న టెన్షన్ కి, ఒకానొక డెడ్ లైన్ కి ఇలా పాటలు పాడుతూ డ్యాన్సులు చేసే మూడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఆసుపత్రిలో ఉన్న సాయిచంద్ తెలివి రాగానే హడావిడిగా తాను కేరళ వెళ్లాలని చెప్పి; తీరా దారిలో ఇలా ఆగి పెళ్లి పాటకి డ్యాన్సులు కట్టే తీరిక, ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇవే సినిమాటిక్ లిబర్టీస్ అంటే. ఇవి లేకపోయినా ఈ కథ సజావుగానే సాగేది.

కేవలం నిడివిని పెంచడానికి, తండ్రీ కొడుకుల మధ్యన సన్నివేశాలకి ఒకటే బ్యాక్ డ్రాప్ కాకుండా చేంజోవర్ ఉండాలి అని లెక్కలేసుకుని రాసుకున్నట్టుగా ఉంది ఆ ట్రాక్, మరియు చర్చిలోని సన్నివేశం.

ఇక అభినయాల విషయానికొస్తే సుధీర్ బాబు చాలా సటిల్ గా చేసాడు. ఎక్కడా ఓవర్ చేయలేదు, అలాగని అండర్ ప్లే కూడా కాదు.

హీరోయిన్ ఉన్నా, లవ్ ట్రాక్ వగైరాలు ఏవీ పెద్దగా లేవు. అంతవరకు బాగుంది.

సాయిచంద్ హైలైట్ గా నిలిచాడు. ఎమోషన్స్ ని సరైన పాళ్లలో పలికించాడు.

సయాజీ షిండే ఓకే. చివర్లో ఐదు నిమిషాలు తప్ప ఓవరాల్ గా ఒకటే టెంపోలో, టెంపర్మెంటుతో సాగింది ఈ క్యారెక్టర్.

ఆమని, జెమిని సురేష్, దేవీప్రసాద్ వారి వారి పాత్రలకి న్యాయం చేసారు.

జై క్రిష్ స్వరపరిచిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు కూడా సందర్భోచితంగా ఉన్నాయి. ఒక పాటలో “నీవే కన్నీళ్లా, ఎవరికీ రావనుకున్నావా?” లాంటి మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి.

మిగిలిన పాటలు ఓకే. కెమెరా, ఎడిటింగ్ లాంటి విభాగాల విషయంలో కంప్లైంట్లేవీ లేవు.

కొడుకు తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి నానా కష్టాలు పడడం, తండ్రి తన కొడుకు గౌరవాన్ని నిలబెట్టడానికి కొడుకు ఫారిన్ లో ఉన్నాడని అబద్ధమాడడం మానవసంబంధాల విలువని చెబుతాయి.

రక్తసంబంధం, పెంచిన ఋణానుబంధం, అవసరం, అవకాశవాదం, నమ్మకం, మోసం, దురాశ, కనువిప్పు.. ఇలా ఈ కథని రకరకాల అధ్యాయాలుగా విభజించవచ్చు. సాధారణంగా ఇలాంటి సినిమాలు ఓటీటీల కోసం తీస్తున్నారు. అలా కాకుండా థియేటర్ లో చూసినా బోర్ కొట్టకుండా బాగానే ఉంది.

బాటం లైన్: హత్తుకునే కథ

12 Replies to “Maa Nanna Superhero Review: మూవీ రివ్యూ: మా నాన్న సూపర్ హీరో”

  1. రివ్యూ అంతా బాగా రాసి 2.5 ఇవ్వడం ఏమిటి? టాప్ ఆరుగురు హీరో లు, ప్రభాస్ కాని, అల్లు అర్జున్ కాని చేసి ఉంటే 3.0 పైన ఇచ్చే వాళ్లేమో!

    1. ఓరి నీ , ప్రతి ఒక్క రివ్యూకి అదే ఏడుపుగొట్టు కామెంట్ రాసి రాసి నీ చేతి రేఖలు ఇంకా అరిగిపోలేదా ? వాడు హత్తుకునే కథ అని కంక్లూజన్ ఇచ్చినా ఇంకా అదే కామెంట్ అంటే ఎలా? ఈ సైట్ లో పాజిటివ్ రాసేదే తక్కువ. మధ్యలో నీ గోల.

Comments are closed.