చిత్రం: మేం ఫేమస్
రేటింగ్: 2/5
బ్యానర్: చాయ్ బిస్కెట్, లహరి ఫిలంస్
తారాగణం: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, శార్య, సిరి రాశి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళిధర్ గౌడ్, శివనందన్ తదితరులు
కెమెరా: శ్యాం దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: కళ్యాణి మాలిక్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్
దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
విడుదల తేదీ: మే 26, 2023
చిన్న సినిమాలు ఆడాలంటే పెద్ద బ్యానరుండాలి, పబ్లిసిటీ వినూత్నంగా చేయగలిగే ఆలోచన ఉండాలి. చాయ్ బిస్కెట్ బ్యార్ మీద తెరకెక్కిన ఈ సినిమాకి జనం దృష్టిని ఆకర్షించే విధంగా ప్రచారమైతే చేసారు. మహేష్ బాబు స్థాయి నటుడిని కూడా ప్రచారానికి సమర్ధవంతంగా వాడగలిగారు. ఇంతకి విషయమెలా ఉందో చూద్దాం.
బండ్ల నరసంపల్లి అనే పల్లెటూరిలో ముగ్గురు స్నేహితులు బాధ్యతారహితంగా తిరుగుతూ ఉంటారు. అంజిమామ అనే ఒకతను వాళ్లని ఏదో ఒక పని చెయ్యమని చెప్తాడు. దాంతో వాళ్లు టెంట్ హౌస్ వ్యాపారం పెడతారు. కానీ అది కాస్తా దెబ్బతింటుంది. ముగ్గురిలో ఒకడు బతుకుతెరువు కోసం సిటీకి వెళ్లిపోతే మిగిలిన ఇద్దరూ “ఫ్యామస్ టీవీ” అని ఒక యూట్యూబ్ చానల్ పెడతారు. వాళ్లు దానితో ఏం సాధిస్తారు అనేది తక్కిన కథ.
కొత్తవాళ్లైనా కూడా ఎక్కడా ఎమెచ్యూర్ అనిపించకుండా చాలా చక్కని అభినయాన్ని కనపరిచారు అందరూ. సుమంత్ ప్రభాస్, లిప్స్టిక్ పాత్రలో నటించినతను అద్భుతంగా నటించారు. అంజిమామ పాత్రధారుడు కూడా ప్రశంసార్హుడు. మిగిలిన నటీనటులందరూ ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా నటించారు.
టెక్నికల్ గా మాత్రం చాలా వీక్ గా ఉన్న సినిమా ఇది. కెమెరా వర్క్ నుంచి, ఆడియో సింక్ వరకు అన్నీ నీరసంగానే ఉన్నాయి. ఎంత పాత్రధారులు యూట్యూబ్ చానల్ పెడితే మాత్రం మొత్తం సినిమా అంతా యూట్యూబ్ వీడియో క్వాలిటీలో ఉండాలని లేదు కదా! ఈ విషయంలో నిర్మాతలు మరీ అతిజాగ్రత్త పడ్డారేమో అనిపిస్తుంది.
“దోస్తులము” అనే ఒక్కపాట తప్ప తక్కిన ఆల్బం మొత్తం బిలో ఏవరేజ్.
ఈ సినిమాలో ప్రధాన లోపం రచన. అది బలంగా ఉంటే మిగిలిన అంశాల్లో అంతగా లోటుపాట్లు కనపడవు. అది తేడా కొట్టడం వల్ల నిర్మాణ విలువలు లేనితనం కనపడింది. సుదీర్ఘంగా సాగే షార్ట్ ఫిల్మ్ లాగ అనిపిస్తుంది. ఒకటి రెండు సన్నివేశాలు, ఒక చిన్న జోక్ తప్ప పెద్దగా గుర్తుపెట్టుకునే విశేషం ఏదీ లేదిందులో.
ట్రైలర్, ప్రచారం చూస్తే ఇది విలేజ్ కామెడీ అనిపిస్తుంది. కానీ లోపలికెళితే విషయం అది కాదు. ఏదో తెర మీద సీన్స్ వెళుతుంటాయి. ఒక సినిమా స్ట్రక్చర్ లో నెరేషన్ సాగదు. ఏవో రెండు మంచి సన్నివేశాలు, రెండు జోక్స్ ఉంటే సినిమా పాసైపోతుందనుకుంటే సరిపోదు కదా. అవే చూపించాలంటే ఏ జబర్దస్త్ స్కిట్ లాంటిదో చేస్తే చాలు.
ఏ పాయింట్ మీదనైనా సినిమా తీయొచ్చు. కానీ ఆ పాయింట్ కి బలమైన కథ, కథనం ఉండాలి. ఎక్కడా డ్రాప్ లేకుండా జాగ్రత్త పడాలి. అన్ని క్రాఫ్ట్స్ మధ్య సమన్వయం కుదరాలి. ఇవి సినిమా తీయడానికి పాటించాల్సిన ప్రాధమిక సూత్రాలు. కానీ ఇవన్నీ లోపించిన సినిమా ఇది.
ట్రైలర్ కట్ చేసిన దాంట్లో సగం ట్యాలెంట్, ప్రొమోషన్ చేసిన దాంట్లో ముప్పావు ట్యాలెంట్ ఈ మొత్తం సినిమా స్క్రిప్ట్ మీద పెట్టుంటే ఫలితం బాగుండేది.
రెండు మూడు నవ్వులు మినహా మిగతా సినిమా అంతా బోరింగే అన్నట్టుంది.
బాటం లైన్: సుదీర్ఘ షార్ట్ ఫిల్మ్