Malli Pelli Review: మూవీ రివ్యూ: మళ్లీ పెళ్లి

చిత్రం: మళ్లీ పెళ్లి రేటింగ్: 2.5/5 తారాగణం: నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణ, వనిత విజయ్ కుమార్ తదితరులు ఎడిటింగ్: జునైద్ సిద్దికి సంగీతం: సురేష్ బొబ్బిలి, అరుళ్ దేవ్…

చిత్రం: మళ్లీ పెళ్లి
రేటింగ్: 2.5/5
తారాగణం: నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణ, వనిత విజయ్ కుమార్ తదితరులు
ఎడిటింగ్: జునైద్ సిద్దికి
సంగీతం: సురేష్ బొబ్బిలి, అరుళ్ దేవ్
నిర్మాత: నరేష్
దర్శకత్వం: ఎమ్మెస్ రాజు
విడుదల తేదీ: 26 మే 2023

మనకి బయోపిక్స్ తెలుసు. కానీ బహుశా ప్రపంచ సినీ చరిత్రలో తమ బయోపిక్ ని తామే తీసుకుని అందులో ప్రధాన పాత్రలుగా తామే నటించిన బాపతు ఎవ్వరూ ఉండుండరు. ఆ రికార్డ్ నరేష్-పవిత్రా లోకేష్ లకు దక్కిందన్నది ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వినిపిస్తున్న విశేషం.

ఎక్కడా మొహమాటాలు లేకుండా, తమ మీద తమ కుటుంబం మీద కాస్తంత వెటకారన్ని ధ్వనించే డైలాగ్స్ కూడా పెట్టుకుని వాటిని అన్నపూర్ణ పాత్ర చేత పలికించారు. నరేష్-పవిత్రలపై రకరకాల రూమర్స్ చెలామణీ అవుతున్న తరుణంలో ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యి చాలామంది దృష్టిని ఆకర్షించింది. వనితా విజయ్ కుమార్ పాత్రని వెనక నుంచి తన్నడం వగైరా సన్నివేశాలు షాకింగ్ గా అనిపించాయి. పైగా దీనికి ఎన్నో సుప్రసిద్ధ సినిమాలు తీసిన నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించడం మరింత ఆసక్తి కలిగించింది. ఇంతకీ ఈ చిత్రంలో ఎముందో చూద్దాం.

కథలోకి వెళ్తే నరేంద్ర (నరేష్) ఒక పాపులర్ నటుడు. అప్పటికే రెండు విడాకులయ్యి మూడవ భార్య సౌమ్య సేతుపతి (వనిత విజయ్ కుమార్) తో జీవిస్తుంటాడు. కానీ భార్యతో అతనికి పొసగదు. డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని తెలుసుకుంటాడు. ఆ సమయంలో పార్వతి (పవిత్ర లోకేష్) అనే మరొక నటి అతనిని ఆకట్టుకుంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు, ఒకరికొకరు గిఫ్ట్స్ లాంటివి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ఆమెతో అయితే తనకి జీవితం ప్రశాంతంగా ఉంతుందనుకుంటాడు నరేంద్ర. కానీ ఆమె భర్తతో చాలా హ్యాపీగా ఉందని చెప్పగానే మరొక అడుగు ముందుకు వేయడు. ఆ నేపథ్యంలో ఆమె నుంచి నరేంద్ర కి ఒక మెసేజ్ వస్తుంది. దాంతో కథ కొత్త మలుపులు తీసుకుంటుంది. ఆ మెసేజ్ ఏమిటి? నరేంద్ర-పార్వతిలు సౌమ్య ఎత్తుగడలని ఎలా ఎదుర్కుంటారనేది తెరపై చూడాలి. 

ఎంత పేర్లు మార్చి చూపించిన ఇది యథాతధంగా నరేష్-పవిత్రల కథ కాదని ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి మీద వాళ్లు జోకులేసుకునే వాళ్లని చాలా గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లుగా గుర్తిస్తుంటారు. అలాగే ఎవరి బయోపిక్ ని వాళ్లు నిర్మొహమాటంగా తీసేసుకున్నా అలాగే గౌరవించే రోజులొస్తాయేమో. అయితే ఈ చిత్రంలో నరేంద్ర పాత్రకి మూడవ భార్యగా నటించిన పాత్రని పెద్ద కుట్రదారిణిగా చూపించారు. ఆ పాత్రని నిజజీవితానికి అలాగే వర్తింపజేసుకోవాలా లేక అది కేవలం దర్శక నిర్మాతల దృష్టికోణంలోని పాత్ర మాత్రమే అనుకోవాలా అనేది వేరే విషయం.

టెక్నికల్ గా చూస్తే కెమెరా వర్క్ చాలా రిచ్ గా ఉంది. సంగీతం మాత్రం వీక్. పాటలు గొప్పగా లేవు. ఎమ్మెస్ రాజు కథనాన్ని మాత్రం మెచ్చుకుని తీరాలి. ఆఖరి కొన్ని నిమిషాలు తప్ప మొత్తం సినిమాని చాలా గ్రిప్పింగ్ గా ఎక్కడా డ్రాప్ కాకుండా నడిపారు. ఎడిటింగ్, డైలాగ్స్ బాగున్నాయి. 

నరేష్, పవిత్రలు తమ పాత్రలే పోషించారు కాబట్టి తమలాగే జీవించారు. అనన్య నాగళ్ల పవిత్ర టీనేజ్ పాత్రని పోషించి కాస్త గ్లామర్ పరిచింది. వనితా విజయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రధారిణి. ఆమె చాలా బాగా నటించింది. జయసుధ-శరత్ బాబు జంట విజయనిర్మల- కృష్ణ జంటలాగా సరిపోయారు. 

ఈ కథని రకరకాల ఎపిసోడ్స్ గా కట్ చేసి అన్నింటినీ చక్కగా కలుపుతూ అల్లారు. వనితా సేతుపతి- నరేష్ ల మధ్యన ట్రాక్, పవిత్రా లోకేష్ కి ఒక రైటర్ తో లివిన్ రిలేషన్, ఆ తర్వాత నరేష్-పవిత్రల రిలేషన్..ఇలా అన్నీ ఆశక్తికరంగా తెరకెక్కించారు. 

మొత్తానికి ఎన్నో ట్రోలింగులకి గురైన నరేష్-పవిత్ర జంట ఇలా తెర మీద జంటగా కనిపిస్తూ తమకథని తామే తెరకెక్కించుకోవడం చూస్తే ట్రోలర్సంతా తోక ముడిచి నెవ్వెరబోవాల్సిందే! సాధారణంగా దర్శకుడు ఆర్జీవీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ని సినిమాలుగా తీస్తుంటాడు. అయితే ఈ నరేష్ అతనిని మించిపోయి స్వీయ బయోపిక్ (“మై”యోపిక్ అనవచ్చేమో) కి శ్రీకారం చుట్టి మన ముందుంచాడు. 

ఇందులో ఇప్పటివరకు తెలియనిది పవిత్ర-రైటర్ మధ్యలో నడిచిన లివిన్ రిలేషన్ గురించి. అదలా ఉంచితే ఏకపక్ష కథనమే అయినా ఎమ్మెస్ రాజు సినిమాటిక్ టచ్ ఇచ్చి ఆసక్తిగొలిపేలా మలచారు. 

ఇందులో రియాలిటీ ఎంత, ఫిక్షన్ ఎంత అనేది పక్కనపెడితే నరేష్-పవిత్రల వివాదాస్పద సంబంధం గురించి క్యూరియాసిటీ ఉన్నవాళ్లు చూడొచ్చు.  

బాటం లైన్: “మై”యోపిక్