రివ్యూ: అమృతం చందమామలో
రేటింగ్: 2/5
బ్యానర్: జస్ట్ ఎల్లో మీడియా ప్రై.లి.
తారాగణం: శ్రీనివాస్ అవసరాల, హరీష్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ఎల్బీ శ్రీరాం తదితరులు
సంగీతం: శ్రీ
కూర్పు: ధర్మేంద్ర
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
రచన, నిర్మాత, దర్శకత్వం: గుణ్ణం గంగరాజు
విడుదల తేదీ: మే 17, 2014
టీవీ సీరియల్స్‌లో ఒక కొత్త ఒరవడి సృష్టించి… సీరియల్స్ అంటే కేవలం ట్రాజెడీ, ఫ్యామిలీ డ్రామాలే కాకుండా… అచ్చమైన హాస్య కథానికలు కూడా ఆదరణ పొందుతాయని నిరూపించింది ‘అమృతం’. బుల్లితెరపై, ఇంటర్నెట్‌లో కూడా సూపర్ హిట్ అయిన అమృతంని సెల్యూలాయిడ్‌పైకి ఎక్కించి మరింత మందిని నవ్వించాలని గుణ్ణం గంగరాజు ‘అమృతం చందమామలో’ తీసారు. అయితే ఉచిత నవ్వులు (టీవీ) పంచిన ఈ అమృతంకి… డబ్బులిచ్చి నవ్వించేంత పైసా వసూల్ రేంజ్ ఉందా?
కథేంటి?
అమృతరావు (శ్రీనివాస్), ఆంజనేయులు (హరీష్) ఇద్దరూ హోటల్ వ్యాపారంలో కోట్లు గడిస్తారు. వారి ఉమ్మడి ఆస్తి రెండు వేల కోట్లు టచ్ చేసిన సందర్భంలో ఒక రాకెట్ కంపెనీ గిమ్మిక్‌కి పడిపోయి… చంద్రమండలంలో బిజినెస్ చేద్దామని ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటారు. తమ ఆస్తులు మొత్తం కొట్టేసిన కంపెనీ ఎత్తేస్తే… చందమామపైకి వెళ్లాలనే తమ కల ఎలా నెరవేరుతుంది? అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురౌతాయనేది మిగతా కథ.
కళాకారుల పనితీరు!
శ్రీనివాస్ అవసరాల మరోసారి తనకి అలవాటైన క్లీన్ కామెడీ చేసాడు. అమృతం పాత్రకి అతను అతికినట్టు సరిపోయాడు. హరీష్ కూడా ఆంజనేయులు క్యారెక్టర్‌కి న్యాయం చేసాడు. అమృతం సీరియల్ చూడడానికి అలవాటు పడ్డ వారు ‘హర్షవర్ధన్, గుండు హనుమంతరావు’కి బదులు వీరికి అడ్జస్ట్ అవడానికి కాస్త సమయం పడుతుంది కానీ ఈ ద్వయం కూడా తమకిచ్చిన పని సక్రమంగా నిర్వర్తించారు.
అమృతంతోనే పాపులర్ అయిన శివన్నారాయణ (ఇంటి ఓనర్ అప్పాజీ), వాసు ఇంటూరి (‘సార్‌వాడు’ వాసు) మరోసారి వినోదాన్ని పంచారు. ఆహుతి ప్రసాద్ చేసిన గుండు ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ బానే ఉంది. ధన్య, సుచిత్ర ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రానికి బడ్జెట్ బాగా అయిందని గుణ్ణం గంగరాజు చెప్పారు కానీ ఆ క్వాలిటీ అయితే తెరపై కనిపించలేదు. టీవీ కోసమే తీసినట్టుగా ఉంది కానీ… వెండితెరకి కావాల్సిన హంగులేమీ లేవు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా సర్‌ప్రైజింగ్‌గా అదే స్టాండర్డ్స్‌తో ఉన్నాయి. గుణ్ణం గంగరాజు ఇంతకుముందు డైరెక్ట్ చేసిన ‘లిటిల్ సోల్జర్స్’, ‘అమ్మ చెప్పింది’ చిత్రాలకి ఈ సమస్య రాలేదు. బహుశా ‘అమృతం’ సీరియల్‌పై ఆయన ఎక్కువ టైమ్ వర్క్ చేయడం వలనో ఏమో… వెండితెరకి తగ్గట్టుగా దానిని మలచలేకపోయారు. రచయితగా అక్కడక్కడా తన మార్కు కామెడీ పంచ్‌లతో నవ్వించినా కానీ… ముందే చెప్పుకున్నట్టు ఇది థియేటర్‌కి వెళ్లి.. డబ్బులిచ్చి చూసే కామెడీ స్టఫ్ కాదు!
హైలైట్స్:
- కామెడీ పంచ్‌లు
డ్రాబ్యాక్స్:
- చంద్రమండలం ఎపిసోడ్
- టీవీ సీరియల్ స్టఫ్
విశ్లేషణ:
టీవీ సీరియల్‌లో క్లిక్ అయిన క్యారెక్టర్స్‌తో సినిమా తీసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. టీవీకోసం ఓ ఎపిసోడ్ తీయడానికి… ఓ సినిమా తెరకెక్కించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తప్పక చూపించాలి. ‘అమృతం చందమామలో’ చిత్రం విషయంలో ఆ తేడా చూపించడంలో దర్శకుడు గుణ్ణం గంగరాజు విఫలమయ్యారు. సినిమాని కూడా సీరియల్‌లానే డీల్ చేసారు.
ఇదే కథతో అమృతం కోసం మరో నాలుగు ఎపిసోడ్లు తీసి ఉంటే టీవీలో చూసి ఎంజాయ్ చేయవచ్చేమో కానీ… సీరియల్‌కి సరిపోయే సరంజామాని తెచ్చి వెండితెరపైకి బలవంతంగా ఎక్కించేస్తే హర్షించి, ఆమోదించడం కష్టం. ‘చందమామలో అమృతం’లో కొన్ని నవ్వించే సంభాషణలున్నాయి. గుణ్ణం గంగరాజు మార్కు క్రియేటివ్ హ్యూమర్ కూడా అక్కడక్కడా దర్శనమిచ్చింది. ఓ ఫ్యాక్షనిస్ట్ కత్తులు, బాంబులు వేసుకుని తిరుగుతున్న సంచిపై ‘స్మోకింగ్ కిల్స్’, ‘చెట్లని నరకొద్దు’, ‘ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు’ వంటి సందేశాలు ప్రింట్ చేయించడం ఆయన హాస్య చతురతకి నిదర్శనం. అయితే ఈ చిన్న చిన్న చెణుకులకి సినిమా అంతటినీ నిలబెట్టే శక్తి లేదు. స్క్రీన్‌ప్లే పరంగా ‘అమృతం చందమామలో’ తేలిపోయింది. హాస్యం పేరిట అక్కడక్కడా హద్దులు దాటారు. నవ్వించడానికి ‘అతిగా’ ప్రయాసపడ్డారు.
ద్వితీయార్థంలో ఈ ప్రయాస తారాస్థాయికి చేరిపోయింది. అమృత విలాస్‌ని తిరిగి మొదలు పెట్టడం దగ్గర్నుంచీ… కథలోకి బిన్ లాడెన్‌ని చొప్పించడం దగ్గర్నుంచీ… చంద్రమండలం చేరేవరకు… అక్కడ జరిగే తంతు వరకు అంతా ఫార్సు వ్యవహారంగా తయారైంది. ఎంత కామెడీ అనుకుని సరిపెట్టుకుందామన్నా… ఎంతగా కితకితలు పెట్టి నవ్వుకుందామన్నా ‘అమృతం చందమామలో’ నవ్వించదు సరికదా… టీవీలో చూడాల్సిన దానికి ఇంత దూరం పని కట్టుకుని వచ్చి… డబ్బులిచ్చి మరీ చూస్తున్నామనే భావన బాధ పెడుతుంది. టీవీలో అయితే ఛానల్ మార్చుకునే సౌకర్యం ఉంటుంది… థియేటర్‌లో అయితే వాకౌట్ మినహా మరో దారి ఉండదు. ఫస్టాఫ్ వరకు ఫర్వాలేదు అనిపించినా కానీ ద్వితీయార్థంలో గాడి తప్పిన అమృతం చందమామ చేరుకునే సరికి చిరాకు పెట్టి… ముగింపుకి వచ్చే సరికి సినిమాకి వచ్చినందుకు పశ్చాత్తాపపడేలా చేస్తుంది.
గుణ్ణం గంగరాజులాంటి క్రియేటివ్ మైండ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే ప్రోడక్ట్ అయితే కాదిది. ఆయనపై అంచనాలతోనో… అమృతంపై ఉన్న అచంచలమైన అభిమానంతోనో థియేటర్‌కి వెళితే మాత్రం నిరాశ తప్పదు. బుల్లితెరపై చెంచాడు భవసాగరాలు ఈదే అమృతరావుని తీసుకొచ్చి బాక్సాఫీస్ సాగరాన్ని ఈదించాలని చూడడం దుస్సాహసం. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని నమ్ముకుని తీసిన ఈ చిత్రం మరి ఎంతవరకు గంగరాజుగారి సాహసానికి తగ్గ ఫలితమిస్తుందో వేచి చూద్దాం.
బోటమ్ లైన్: ‘అమృతం చందమామలో’ – సీరియల్‌కి ఎక్కువ.. సినిమాకి తక్కువ!
-జి.కె.