సినిమా రివ్యూ: చక్కిలిగింత

రివ్యూ: చక్కిలిగింత రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: మహీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి., ఇలవల ఫిలింస్‌ తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, రెహానా, తాగుబోతు రమేష్‌, వైవా హర్ష, చైతన్య కృష్ణ తదితరులు మాటలు: జయంత్‌ సంగీతం: మిక్కీ…

రివ్యూ: చక్కిలిగింత
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: మహీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి., ఇలవల ఫిలింస్‌
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, రెహానా, తాగుబోతు రమేష్‌, వైవా హర్ష, చైతన్య కృష్ణ తదితరులు
మాటలు: జయంత్‌
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాతలు: సిహెచ్‌. నరసింహాచారి, ఇలవల నరసింహారెడ్డి
రచన, దర్శకత్వం: వేమారెడ్డి
విడుదల తేదీ: డిసెంబర్‌ 05, 2014

రొటీన్‌కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సుకుమార్‌ వద్ద రచనా విభాగంలో పని చేసిన వేమారెడ్డి దర్శకుడిగా మారి ‘చక్కిలిగింత’ పెడుతున్నాడంటే… సినీ పరిశ్రమకి చెందిన వారి వరకు ఆసక్తి చూపించారు. సుకుమార్‌ స్కూల్‌ నుంచి వచ్చిన వేమారెడ్డి కూడా తన గురువు మాదిరిగా ఫస్ట్‌ ఫిలింతోనే సర్‌ప్రైజ్‌ చేసాడో లేదో చూద్దాం. 

కథేంటి?

అమ్మాయిల వెంట పడి ప్రేమిస్తున్నామంటూ తిరిగితే అబ్బాయిలు అలుసైపోతారని తన స్నేహితులకి క్లాస్‌ పీకుతాడు ఆడి (సుమంత్‌). అతని గీతోపదేశంతో అమ్మాయిలకి దూరంగా ఉంటారు ఆ కాలేజ్‌లోని అబ్బాయిలంతా. అబ్బాయిలు తమని పట్టించుకోవడం లేదని అమ్మాయిలు తెగ ఇదైపోతుంటారు. అప్పుడే కాలేజ్‌కి కొత్తగా వచ్చిన అవి (రెహాన) సరాసరి ఆడినే తన ప్రేమలోకి దించితే మిగిలిన వాళ్లంతా సెట్‌ అయిపోతారని అతడిని ప్రేమలోకి దించడమే టార్గెట్‌గా పెట్టుకుంటుంది. 

కళాకారుల పనితీరు:

సుమంత్‌ అశ్విన్‌ ఇంతకుముందే తన నటనతో ఇంప్రెస్‌ చేసాడు. ఈ చిత్రంలో కూడా తన పాత్రకి పరిపూర్ణ న్యాయం చేస్తూ ఈ జోనర్‌ సినిమాలకి తను మంచి ఆప్షన్‌ అని ప్రూవ్‌ చేసుకున్నాడు. తనని బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా చూపిస్తే యాక్షన్‌ సీన్స్‌ కన్విన్సింగ్‌గా ఉంటాయనుకున్నారు కానీ సుమంత్‌కి అవి సూట్‌ కాలేదు. ఇంకొన్నాళ్ల పాటు తన బలానికే కట్టుబడి… తన కండబలం చూపించే పని పెట్టుకోకపోతేనే మంచిది. 

రెహాన మొదటి సినిమా అయినా ఫర్వాలేదనిపించింది కానీ చాలా సందర్భాల్లో కరెక్ట్‌గా లిప్‌ సింక్‌ ఇవ్వలేకపోయింది. కాస్త సానబడితే ఈ తరహా ప్రేమకథా చిత్రాలకి బాగానే పనికొస్తుంది. కథ మొత్తం హీరో హీరోయిన్ల చుట్టే తిరుగుతుంది కనుక మిగిలిన వారికి ఎక్కువ స్కోప్‌ దక్కలేదు. స్నేహితుల బృందంలో అప్‌కమింగ్‌ కమెడియన్స్‌ చాలా మందిని పెట్టుకున్నారు కానీ ఎవరూ హైలైట్‌ అవలేదు. తాగుబోతు రమేష్‌ ఫస్ట్‌హాఫ్‌ వరకు తాగుడుకి దూరంగా భిన్నంగా కనిపించి… ద్వితీయార్థంలో తన రొటీన్‌ రూపమెత్తేసాడు. నందు, వైవా హర్ష, చైతన్య కృష్ణ తదితరులు తమ పరిధులలో చేయగలిగింది చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:    

మిక్కీ జె. మేయర్‌ మ్యూజిక్‌ చాలా యావరేజ్‌గా ఉంది. ‘ఇదివరకో..’ పాట తప్ప ఇంకేదీ గుర్తుంచుకునేలా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పరంగా మిక్కీ స్కోర్‌ చేసాడు. డైలాగ్స్‌ చాలా మామూలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మరీ లెంగ్తీ డైలాగ్స్‌తో లెక్చర్స్‌ వినిపించారు. సంభాషణా రచయిత కనీసం సపోర్టింగ్‌ కాస్ట్‌తో అయినా వినోదం పండించే ప్రయత్నం చేయలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అని చెప్పాలి. చిన్న సినిమాలకి క్వాలిటీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న సాయి శ్రీరామ్‌ ‘అలా ఎలా’ తర్వాత మరోసారి తన ప్రతిభ చూపించాడు. 

Video: Chit Chat With Chakkiligintha Team

‘‘అమ్మాయిలకి అబ్బాయిలే ఎందుకు ప్రపోజ్‌ చేయాలి. ముందుగా వారే ఎందుకు స్పందించకూడదు..’’ అనే చిన్న ఐడియాని బేస్‌ చేసుకుని వేమారెడ్డి ఈ సినిమా తీసేసాడు. ఈ పాయింట్‌ని లైవ్‌లీగా ప్రెజెంట్‌ చేసే స్క్రీన్‌ప్లే మిస్‌ అవడంతో ఈ సింగిల్‌ లైన్‌ స్టోరీ ఫస్టాఫ్‌లో సగమైనా కాకముందే విసిగించడం మొదలెట్టింది. ఆకట్టుకునే క్యారెక్టరైజేషన్స్‌ కానీ, ఎంటర్‌టైనింగ్‌ ఎలిమెంట్స్‌ కానీ లేకుండా ఎంతసేపు ఆ పాయింట్‌ చుట్టే చక్కర్లు కొట్టిన ఈ చిత్రం ‘చక్కిలిగింత’లు పెట్టలేక ఆవులింతలు మిగిల్చింది. 

హైలైట్స్‌:

  • కాన్సెప్ట్‌
  • ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • సింగిల్‌ లైన్‌ స్టోరీ
  • బోరింగ్‌ స్క్రీన్‌ప్లే

విశ్లేషణ:

ముందే చెప్పినట్టు కేవలం ఒక ఐడియాని బేస్‌ చేసుకుని రెండున్నర గంటల సినిమా తీసేయడం వల్ల చాలా త్వరగా ఈ చిత్రం ‘బోరింగ్‌ పాయింట్‌’కి రీచ్‌ అయిపోయింది. ఇంటర్వెల్‌ వరకు హీరోని తన ప్రేమలోకి దించడానికి హీరోయిన్‌ చేసే ప్రయత్నాలు… ఇంటర్వెల్‌ తర్వాత తనపై హీరోయిన్‌కి ఉన్న ప్రేమని ఆమె గుర్తించేందుకు హీరో పడే తాపత్రయాలతో ఈ చిత్రం ఎంతకీ ముందుకు కదలదు. ఆసక్తికర సన్నివేశాలతో అయినా ఇలాంటి కథని కొంతవరకు రక్తి కట్టించవచ్చు. కానీ సన్నివేశాలన్నీ చాలా సాదాసీదాగా ఉన్నాయే తప్ప ఎక్కడా ఇంప్రెస్‌ చేసే రొమాంటిక్‌ మూమెంట్స్‌ లేవు. 

క్లయిమాక్స్‌కి ముందు ఒక సీన్‌లో యాక్షన్‌ మోడ్‌లోకి షిఫ్ట్‌ అయితే చాలా రిలీఫ్‌ అనిపిస్తుంది. దానిని బట్టే తెలుస్తుంది… ఈ చిత్రం ఎంత వన్‌ డైమెన్షనల్‌గా తెరకెక్కి విసిగించిందో అనేది. బాస్కెట్‌ బాల్‌.., ‘హనీ’ అనే పేరున్న చెట్టు వంటి వాటిపై చేసిన ప్లే బాగుంది. ఆడి.. అవి అనే పేర్లు బాస్కెట్‌బాల్‌పై రాసి.. ‘మన ఇద్దరి మధ్య ఏముంది… ఏం లేదే’ అని హీరో అనడం… దానికి ఆన్సర్‌ అతనికి క్లయిమాక్స్‌లో తెలియడం చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి హృద్యమైన సన్నివేశాలు చాలా తక్కువ ఉండడం, లీడ్‌ క్యారెక్టర్స్‌ ఎట్రాక్టివ్‌గా కాకుండా చెప్పిందే చెప్పి విసిగించడం, సబ్‌ ప్లాట్స్‌ ఏమీ లేకుండా… టోటల్‌ ఫోకస్‌ సింగిల్‌ పాయింట్‌పైనే ఉంచడం ‘చక్కిలిగింత’కి మైనస్‌గా మారాయి. 

హాలీవుడ్‌లో ఈ తరహా కాన్సెప్ట్‌ బేస్డ్‌ రొమాంటిక్‌ మూవీస్‌ని నైంటీ మినిట్స్‌లో ముగించేస్తారు. కొంచెం రాడికల్‌గా ఆలోచించి… అలా దీన్ని తక్కువ టైమ్‌లో ముగించేసినట్టయితే మరీ ఇంత విసిగించి ఉండేది కాదేమో. 

వేమారెడ్డిలో యూత్‌ఫుల్‌ ఆలోచనలున్నాయి. యువతరం ప్రేక్షకులకి కనెక్ట్‌ అయ్యే థియరీలు కూడా అతని వద్ద బాగానే ఉన్నాయి. అయితే ఆ ఆలోచనని పూర్తి స్థాయి సినిమాగా మలిచే కథనం లేక ‘చక్కిలిగింత’ గిలిగింతలు పెట్టలేక బోల్తా పడింది. ప్రధానంగా టార్గెట్‌ చేసింది యంగ్‌స్టర్స్‌ని అయినా కానీ వారిని కూడా కదలకుండా కూర్చోబెట్టే వినోదం ఇందులో కొరవడింది. ఈ మైనస్‌ పాయింట్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం పెద్ద పరీక్షనే ఎదుర్కొంటుంది.  

బోటమ్‌ లైన్‌: ఆవులింత!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri