రివ్యూ: రామయ్యా వస్తావయ్యా
రేటింగ్: 2.75/5
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: ఎన్టీఆర్, సమంత, శృతిహాసన్, రోహిణి హట్టంగడి, ముఖేష్ రిషి, రవిశంకర్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు
కథనం: సతీష్ వేగేశ్న, రమేష్
సంగీతం: తమన్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
నిర్మాత: దిల్ రాజు
కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్
విడుదల తేదీ: అక్టోబర్ 11, 2013
రవితేజతో ‘మిరపకాయ్’, పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’… టైలర్‌మేడ్ క్యారెక్టరైజేషన్స్‌తో, సదరు హీరోలకి ఉన్న ట్రేడ్‌మార్క్ బాడీలాంగ్వేజ్, మేనరిజమ్స్‌ని హైలైట్ చేస్తూ, అటు వారి అభిమానుల్ని అలరిస్తూ, ఇటు వినోదాన్ని ఆశిస్తూ వచ్చే ప్రేక్షకులకి కోరింది ఇస్తూ… తన ప్రత్యేకతని చాటుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇతని డైరెక్షన్‌లో సూపర్‌స్టార్ ఎన్టీఆర్ హీరోగా సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు ఏర్పడతాయి. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గ కథని, తన మార్కు వినోదాన్ని జోడిరచి ఒక పవర్‌ఫుల్ ప్యాకేజ్ అందిస్తాడని, ఇంకో పెద్ద హిట్ కొట్టేసి హ్యాట్రిక్ కంప్లీట్ చేసేస్తాడని తప్పకుండా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. గత కొంత కాలంగా ఎన్టీఆర్‌కి ‘అందని ద్రాక్ష’గా మారిపోయిన బ్లాక్‌బస్టర్‌ని ‘రామయ్యా వస్తావయ్యా’ అయినా చేతికందిస్తుందో… రెండు హిట్స్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ అయిపోయిన హరీష్ శంకర్‌ని హ్యాట్రిక్ వరిస్తుందో లేదో… సమీక్షించుకుందాం.
కథేంటి?
నందు (ఎన్టీఆర్) మినిష్టర్ (ముఖేష్ రిషి) కూతురైన ఆకర్షతో (సమంత) ప్రేమలో పడతాడు. ఆమెకి దగ్గరై, ఆమె కుటుంబ సభ్యులకి కూడా దగ్గరైన నందు ఇదంతా ఓ కారణం మీద చేస్తున్నాడనే సంగతి కథ ముందుకి సాగే కొద్దీ తెలుస్తుంది. నందు అలా ఆమెకి ఎందుకు దగ్గరవుతాడో, అతని వెనుక ఉన్న కథేంటో అన్నదే ‘రామయ్యా వస్తావయ్యా’ ఇతివృత్తం.
కళాకారుల పనితీరు!
ఎన్టీఆర్‌ని ఈ చిత్రంలో కొత్త కోణంలో చూపించారు. ఎన్టీఆర్ కొంత కాలంగా యూత్‌ఫుల్‌గా అనిపించే పాత్రలు ఎంచుకుంటున్నా కానీ ఇంత మేకోవర్ అయితే ఇంతకుముందు సినిమాల్లో కనిపించలేదు. ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే డాన్సులు, పంచ్ డైలాగులు, స్వర్గీయ ఎన్టీఆర్ రిఫరెన్సులు, పౌరాణిక వేషాలు… వగైరా, వగైరా అన్నీ ఉన్నా కానీ ఈ చిత్రంలో ప్రత్యేకంగా అనిపించేది మాత్రం ఎన్టీఆర్ యూత్‌ఫుల్ స్టయిల్ అండ్ ప్రెజెంటేషన్. ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో హరీష్ సక్సెస్ అయినట్టే. ఎన్టీఆర్‌ని మునుపటిలానే చూడాలని అనుకునే వారికి తగ్గట్టుగా ఆ అంశాలు కూడా జోడిరచారు. యాక్టర్‌గా ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు.
సమంత మరోసారి సినిమాలో పెద్దగా రోల్ ప్లే చేయని పాత్ర పోషించింది. శృతిహాసన్ పాత్ర మరీ శృతి మించింది. ఆ పాత్రచిత్రణ బాగోకపోవడం వల్ల ఇటు శృతి తేలిపోవడమే కాకుండా సినిమాకి కూడా చేటు జరిగింది. ముఖేష్ రిషి రొటీన్ పాత్ర పోషించగా, రవి శంకర్ తన హావభావాలతోనే విలనీ పండిరచాడు. ఆ పాత్రని ఎక్కడో ప్రీ క్లయిమాక్స్ ముందు సడన్‌గా పరిచయం చేయడం వల్ల ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. రావు రమేష్‌ని కూడా సరిగా వాడుకోలేదు. రోహిణి హట్టంగడిపై తీసిన కామెడీ సీన్ నవ్విస్తుంది. కోట శ్రీనివాసరావు మరోసారి ఓ చిన్న పాత్రలో అలా మెరిశారు. తనికెళ్ల భరణికి ఓ సీన్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. మిగిలిన నటీనటులు ఎవరికీ కూడా గుర్తుండే పాత్రలు దక్కలేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
హరీష్ శంకర్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. సంభాషణల రచయితగా అతను రాణించాడు. తమన్ ట్యూన్స్ రిపీట్ అవుతున్న భావన కలుగుతోంది. జాబిల్లి, నేనెప్పుడైనా… పాటలు బాగున్నాయి కానీ పూర్తి స్థాయిలో అన్ని పాటలూ మెప్పించే ఆల్బమ్ కాదిది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా తమన్ చేసిన తప్పులే రిపీట్ చేస్తున్నాడు. కొన్ని సన్నివేశాల్లో మెప్పించేలా, మరికొన్ని సందర్భాల్లో తేలిపోయేలా చేస్తున్నాడు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే దర్శకుడు కాకుండా వేరే రచయితలు సమకూర్చారు. ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ ముందు జరిగే తంతు తప్పిస్తే మిగతా చోట్ల స్క్రీన్‌ప్లే ఎఫెక్టివ్‌గా అనిపించదు. పైగా ఫస్టాఫ్‌కీ, సెకండాఫ్‌కీ మధ్య కోఆర్డినేషన్ పూర్తిగా కొరవడిరది.
సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికేమీ లేదు. ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉండాల్సింది. ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్థంలో లేదు. దానికి కథాపరంగా జరిగిన సడన్ షిఫ్ట్ కూడా కొంతవరకు కారణమనుకోవాలి. దిల్ రాజు తన వంతుగా బాగానే ఖర్చు పెట్టాడు. టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపించుకుంటుంది. ఎవరూ డామినేట్ చేయలేదు. అలా అని ఎవరూ బ్యాడ్ అవుట్‌పుట్ కూడా ఇవ్వలేదు.
కథని ఎంచుకోవడంలోనే హరీష్ పొరపాటు చేశాడు. ఎన్నోసార్లు చూసేసిన రివెంజ్ డ్రామాని కథాంశంగా ఎంచుకున్నప్పుడు కట్టిపడేసే కథనం కంపల్సరీ. అది లోపించడం వల్ల అతను మిగతా విషయాల్లో ఎంత కవర్ చేయాలని చూసినా కానీ ‘రామయ్యా వస్తావయ్యా’ నిరుత్సాహానికి గురి చేసి, అసంతృప్తి కలిగిస్తుంది.
హైలైట్స్:
- ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్
- ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్
- 2 సాంగ్స్
- ఎన్టీఆర్‌ని కొత్తగా ప్రెజెంట్ చేసిన స్టయిల్
డ్రాబ్యాక్స్:
- రొటీన్ స్టోరీ
- వీక్ విలన్
- సెకండాఫ్‌లో మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్
విశ్లేషణ:
హీరో పరిచయం దగ్గర్నుంచి, అతని నడక, నవ్వు, మాటతీరు, వేషధారణ… అన్నిట్లోను హరీష్ శంకర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. తన హీరోని తెరపై ఎలా చూపిస్తే కొత్తగా ఉంటుందనే విషయంపై హరీష్ చాలా హోమ్ వర్క్ చేసినట్టున్నాడు. కొన్ని సీన్స్‌లో ఎన్టీఆర్‌ని చూస్తే ఇంతవరకు అతడిని ఇలా చూపించాలనే ఐడియా ఎవరికీ ఎందుకు రాలేదో అనిపిస్తుంది. హీరోయిన్ వెంట పడుతూ టీజ్ చేయడం, చుట్టూ ఓ గ్యాంగ్‌ని వేసుకుని సొల్లు కబుర్లు చెబుతూ ఒక సగటు యువకుడిలా కనిపించడం ఎన్టీఆర్ ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఈ చిత్రంలో అతనలా చేయడం వల్ల కొత్తదనం వచ్చింది.
అయితే ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించాలనే విషయంపై కసరత్తు చేసిన దర్శకుడు తన కథ, కథనాలపై అదే స్థాయి ఎక్సర్‌సైజ్ చేయలేదనే సంగతి సినిమా చూస్తుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే కథా పరంగా ఎలాంటి కొత్తదనం ఇందులో లేదు. కనీసం కథనంలో కూడా ఎలాంటి చమక్కులు లేవు. సాఫీగా సాగిపోతున్న సినిమాలో ఇంటర్వెల్ దగ్గరో ట్విస్టు ఉంటుందనేది ఎన్నో కమర్షియల్ సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులు ఇట్టే ఊహించగలరు. అంతదాకా తన సినిమాని ఒక పద్ధతి ప్రకారం నడిపించిన హరీష్ ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా పంథా మార్చేశాడు. ఎన్టీఆర్ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయాలనే ఆరాటమో లేక ఎన్టీఆర్ సినిమాలో అవన్నీ ఉండి తీరాలనే నమ్మకమో కానీ ద్వితీయార్థంలో రామయ్య సాంతం గాడి తప్పాడు.
ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చూసిన ఎవరికైనా సినిమా అంతా అదే ప్యాట్రన్‌లో వెళ్లిపోతే, మంచి ఎంటర్‌టైనర్ అవుతుందనే ఫీల్ కలుగుతుంది. మాస్‌ని అలరించాలంటే నరుక్కోవడాలు, రక్తపాతాలే అవసరం లేదు కదా. సింపుల్ ఫైట్స్‌తో, సమవుజ్జీ అయిన విలన్‌తో కూడా మాస్ ఎలిమెంట్స్ పండిరచుకోవచ్చు. కానీ హరీష్ మాత్రం ఎన్టీఆర్‌ని పూర్తిగా సింహాద్రి మోడ్‌లోకి షిఫ్ట్ చేశాడు. దీంతో ఫస్టాఫ్‌లో చూసిన దానికీ, ద్వితీయార్థంలో కనిపించే దానికీ పొంతన లేకుండా పోతుంది. ఇంటర్వెల్ వరకు ఉన్న మూడ్ డిస్టర్బ్ కావడమే కాకుండా, అంతవరకు ఏర్పడ్డ అంచనాలు తారుమారై పూర్తిగా నిరుత్సాహం అలముకుంటుంది. ద్వితీయార్థంలో ఫస్టాఫ్‌కి కంప్లీట్ కాంట్రాస్ట్‌గా ఉండడమే కాకుండా ఎమోషన్స్, వయొలెన్స్ ఎక్కువై హెవీ అనిపించడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయిపోతుంది. థియేటర్లు వదిలి వచ్చేటప్పటికి ఇంటర్వెల్‌లో ఉన్న మూడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. పైగా ఇలాంటి రివెంజ్ కథలు ఎన్టీఆర్‌కి కొత్తేమీ కాదు. దీని వల్ల అభిమానులకి కూడా ద్వితీయార్థంలో ఎలాంటి కొత్తదనం కానరాదు.
హీరో అంత ఎమోషనల్‌గా రియాక్ట్ అయిపోయి, అంత వైల్డ్‌గా, వయొలెంట్‌గా ప్రతీకారం తీర్చుకోవడానికి తగ్గ బేస్ క్రియేట్ చేయలేదు. అంతవరకు ఉన్న సబ్‌స్టెన్స్ చాలని అనుకుని ఉంటారు కానీ సరైన బిల్డప్ లేకపోవడం వల్ల ఆ సీన్లన్నీ తేలిపోయి, అక్కర్లేని రక్తపాతాన్ని సినిమాలోకి కొని తెచ్చుకున్నట్టయింది. ఈ చిత్రానికి హాలిడే పీరియడ్ కలిసి వస్తే మొదటి వారం వసూళ్లు బాగుంటాయి. ఆ తర్వాత ముందుకి సాగడానికి కావాల్సిన ఇంధనం, సామర్ధ్యం రెండూ ఈ సినిమాకి లేవు. మరి దీనిని ‘రామయ్య’ ఎన్టీఆర్ ఎందాకా లాగగలడనేది చూడాలిక.
బోటమ్ లైన్: జూనియర్ ‘రామయ్య’ అభిమానులకి మాత్రమే!
కిరణ్