క్రికెట్‌కి గుడ్‌ బై : సచిన్‌

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌. అయితే ఇంకొక్క టెస్ట్‌ మాత్రం సచిన్‌ ఆడనున్నాడు. వెస్టిండీస్‌తో నవంబర్‌లో జరగబోయే టెస్ట్‌ అనంతరం క్రికెట్‌ నుంచి వైదొలగుతానని సచిన్‌,…

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌. అయితే ఇంకొక్క టెస్ట్‌ మాత్రం సచిన్‌ ఆడనున్నాడు. వెస్టిండీస్‌తో నవంబర్‌లో జరగబోయే టెస్ట్‌ అనంతరం క్రికెట్‌ నుంచి వైదొలగుతానని సచిన్‌, తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపాడు.
ఇప్పటికే సచిన్‌, వన్డే, టీ`20 వంటి పరిమిత ఓవర్ల క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన విషయం విదితమే. వన్డే, టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్‌ సాధించినన్ని పరుగులు ఇంకే క్రికెటర్‌ సాధించలేదు. భవిష్యత్తులో సచిన్‌ రికార్డుల్ని ఇంకో క్రికెటర్‌ సాధిస్తాడా.? అన్నదీ అనుమానమే.
అంతర్జాతీయ క్రికెట్‌లో వేరెవరికీ సాధ్యం కాని అనేక అద్భుతాలు సాధించాడు సచిన్‌. అత్యధిక టెస్ట్‌లు, అత్యధిక వన్డేలు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్‌ సెంచరీలు.. ఇలా చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. గొప్ప క్రికెటర్‌గానే కాక, క్రికెట్‌పై ఆసక్తి కనబరిచే ప్రతి యువకుడికీ అతనో దేవుడిగా మారిపోయాడు.
ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. కాదు కాదు, అతనికి భక్తులున్నారు. ఆ భక్తుల్లో మేటి క్రికెటర్లూ వున్నారనడం అతిశయోక్తి కాదు. బీసీసీఐకి పంపిన లేఖలో సచిన్‌, ‘క్రికెట్‌ లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టంగా వుంది’ అని పేర్కొనడం అతని అభిమానులకు కంటతడి పెట్టిస్తోంది.
వన్డేల్లో 18 వేల పైచిలుకు పరుగులు, టెస్టుల్లో 15 వేల పై చిలుకు పరుగులే కాదు, వన్డేల్లో డబుల్‌ సెంచరీ దాటిన తొలి ఆటగాడు సచిన్‌. ఇంకే ఇతర క్రికెటర్‌కీ సాధ్యంకాని రీతిలో ఏకంగా 24 ఏళ్ళు క్రికెటర్‌గా సచిన్‌ ఓ వెలుగు వెలిగాడు. క్రికెట్‌లో సక్సెస్‌, ఫెయిల్యూర్‌ మామూలే అయినా, ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా తక్కువ సచిన్‌కి.
ఎప్పుడూ బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం చెప్పిన సచిన్‌, క్రికెట్‌కి దూరమవుతున్నాడంటే అభిమానులు అంత తేలిగ్గా జీర్ణించుకోలేరు మరి.