ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే ఓటర్లు ఏ పార్టీని ఆదరించాలో డిసైడ్ అయ్యారు. ఇదే సందర్భంలో తటస్థ ఓటర్లు ఎటు వైపు అనే చర్చ జరుగుతోంది. తటస్థుల్లో మెజార్టీ మద్దతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే లభిస్తోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం… గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చడం, అలాగే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన పాలకుడికి అడగడుగునా అడ్డంకులు సృష్టించడం తటస్థులకు ఏ మాత్రం నచ్చడం లేదు.
ముఖ్యంగా జగన్ పాలనంతా పేద ప్రజల కేంద్రంగా సంక్షేమ లబ్ధిని అందించడాన్ని తటస్థులు ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ నిజాయతీ, నిబద్ధత తటస్థ ఓటర్లన్ని ఆకట్టుకుంటోంది. ఏదైనా ఒకటి చెబితే, ఎన్ని ఇబ్బందులొచ్చినా సాకారం చేసేందుకు జగన్ ప్రయత్నించడం తటస్థ ఓటర్లని వైసీపీ వైపు చూసేలా చేస్తోంది. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై తటస్థులు ఆగ్రహంగా ఉన్నారు.
అధికారంలోకి వస్తే, తామేం చేస్తారో చెప్పకుండా, ఎంతసేపూ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడానికే బాబు, పవన్ పరిమితం అయ్యారని తటస్థులు తప్పు పడుతున్నారు. 18 రోజుల్లో ఎన్నికలున్నాయని, ఇప్పటి వరకూ కూటమి తానేం చేస్తుందో చెప్పలేదని మండిపడుతున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం చేయకపోవడంపై తటస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఆచరణకు నోచుకోవని, అందుకే వాటిని పక్కన పడేశారని తటస్థులు విమర్శిస్తున్నారు.
కానీ జగన్ నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీల్లో ప్రతిదీ అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం తదితర ఒకట్రెండు హామీలను మినహాయిస్తే, జగన్ పాలనతో సామాన్య ప్రజానీకానికి నష్టమేమీ లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి, నేరుగా ఇంటి వద్దకే పాలన అందిస్తున్నారని తటస్థులు మెచ్చుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఎల్లో మీడియా దుర్మార్గ రాతలు తటస్థులు అసహ్యించుకునేలా చేస్తున్నాయి. ఎల్లో మీడియా, బాబు నేతృత్వంలోని ప్రతిపక్షాలు విషం చిమ్మడం తప్ప, ఏమీ చేయడం లేదనే ఆవేదన తటస్థుల్లో కనిపిస్తోంది. అందుకే తటస్థుల్లో మెజార్టీ ప్రజానీకం జగన్‌కు అండగా నిలిచేందుకు సిద్ధమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.