వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమిలో జోష్ నింపారు. వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించి, సొంత పార్టీలో తీవ్ర నిరాశ, నిస్పృహలను, ప్రత్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘనత జగన్‌కే దక్కింది. జగన్‌ను ఓడించడానికి ప్రత్యర్థులెవరూ అవసరం లేదు, ఆయనే చాలు అని చాలా కాలంగా ఒక బలమైన అభిప్రాయం వుంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న వైసీపీ మేనిఫెస్టో ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది.
జగన్ ఎలాంటి పథకాలను ప్రకటిస్తారో అని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రత్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. జగన్ మేనిఫెస్టో ప్రకటన సొంత పార్టీ శ్రేణుల్ని ఒక్కసారిగా కుంగతీసింది. ఇదే సందర్భంలో ప్రత్యర్థులు ఆనందంలో కేకలేస్తున్నారు. మేనిఫెస్టో ప్రకటనకు ముందు… పథకాల అమలు సాధ్యాసాధ్యాల గురించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా పవిత్రంగా భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
జగన్ చెబితే చేస్తారని ప్రత్యర్థులు సైతం విశ్వసించడం వల్లే వైసీపీ మేనిఫెస్టో కోసం వారంతా కూడా ఎదురు చూశారని గుర్తించుకోవాలి. బడ్జెట్ గురించి ఎన్నెన్నో చెప్పి… చివరికి కొన్నింటిలో రెట్టింపు లబ్ధి కలిగించి, మరి కొందరికి నిరాశ మిగల్చడంతో అసంతృప్తి నెలకుంది. నిజానికి ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్లోనే జగన్ అందరికీ ఆమోదయోగ్యంగా మేనిఫెస్టోను రూపొందించి వుండొచ్చు.
ఉదాహరణకు వైఎస్సార్ చేయూత కింద గతంలో 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేశారు. ఈ దఫా వారికి రూ.1.50 లక్షలు ఇస్తామని జగన్ ప్రకటించారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టారు. అయితే ఆ బడ్జెట్‌ను రూ.లక్షకు పెంచి, మిగిలిన రూ.50 వేలను రైతులు, సామాజిక పింఛన్‌దారుల కోసం కేటాయించి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే అలాగే వైఎస్సార్ కాపు నేత్తం కింద గతంలో రూ.60 వేలు ఇచ్చేవారు. ఈ దఫా ఆ మొత్తాన్ని రూ.1.20 లక్షలకు పెంచారు. మొత్తం లబ్ధిదారులు 4.63 లక్షల మంది. ఈ బడ్జెట్‌ను రూ.75 వేలు లేదా రూ.80 వేలకు పెంచి ఉండాల్సింది. అలాగే వైఎస్సార్ ఈబీసీ నేత్తం కింద అగ్రవర్ణ అక్కచెల్లెమ్మలకు ఇంత వరకూ ఏడాదికి రూ.60 వేలు అందించారు. ఇకపై రూ.1.05 లక్షలు అందిస్తామని జగన్ ప్రకటించారు. మొత్తం లబ్ధిదారులు 4.95 లక్షల మంది. ఈ బడ్జెట్‌ను కూడా రూ.75 వేలు లేదా రూ.80 వేలకు పెంచి, మిగిలిన మొత్తాన్ని రైతులు, సామాజిక పింఛన్‌దారులకు కేటాయించి వుండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇలా బడ్జెట్‌ను, లబ్ధిదారులను సమన్వయం చేసుకుని రైతుల రుణమాఫీ రూ.లక్ష వరకు చేసి వుంటే…వైసీపీ అధికారానికి తిరుగు వుండేది కాదని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే సామాజిక పింఛన్‌దారులకు కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రూ.4 వేలతో పాటు రెండు నెలల అరియర్స్ కూడా ఇస్తామని చెప్పడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ కూడా అంతే మొత్తాన్ని ఎలాగోలా సర్దుబాటు చేసుకుని ప్రకటించి వుంటే బాగుండేదని అంటున్నారు.
మేనిఫెస్టోను ఎవరు రూపొందించారో తెలియదు కానీ, మరీ తెలివి తక్కువగా వుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. రైతాంగం విషయంలో జగన్ కనీస మానవత్వం లేకుండా మొదటి నుంచి ప్రవర్తిస్తున్నారనే ఆగ్రహం వారిలో వుంది. ఇతరులకు లక్షలాది రూపాయలు అప్పనంగా ఇవ్వడానికి జగన్ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, తమ వరకూ వచ్చే సరికి ఆయనకు ఎందుకు మనసు రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తగినంత బడ్జెట్ లేదనే కారణంతో ఎవరికీ ఏమీ ఇవ్వకపోతే జగన్‌ను అర్థం చేసుకోవద్చని, కొందరి విషయంలో ఒకలా, తమ దగ్గరికి వచ్చే సరికి బీద అరుపులు అరవడంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు రైతు రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ చేయలేదని, అందువల్ల ఆయన్ను నమ్మరని, తనకే ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో తమ గొంతు కోస్తామంటే ఎలా? అని రైతాంగం ప్రశ్నిస్తోంది.
నాలుగు సిద్ధం సభలు, అలాగే 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సుయాత్రలతో వచ్చిన ఊపంతా… ఒకే ఒక్క మేనిఫెస్టోతో పోయిందని వైసీపీ అభిమానులు వాపోతున్నారు. ఇదే సందర్భంలో కూటమి నేతల్లో ఒక్కసారిగా హుషారొచ్చింది. ఈ మేనిఫెస్టోను చూసి ఎవరూ ఓట్లు వేయరనే నమ్మకం కూటమిలో పెరగడం విశేషం. కేవలం తన విశ్వసనీయత, నిజాయతీ చూసి జనం ఆదరిస్తారని జగన్ నమ్మకంగా వుండడాన్ని తప్పు పడుతున్నారు. అసలు రాజకీయాల్లో లేని వాటిని పట్టుకుని జగన్ వేలాడడాన్ని వైసీపీ నేతలు సైతం తప్పు పడుతున్నారు.
వైసీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఏం చేస్తారో ఊసే లేదు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్పు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తామని హామీ.
అలాగే రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్య, వైద్యానికి, ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్య, వైద్యానికి , ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలూ వారికీ వర్తింపజేస్తామని ప్రకటించారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు, 60 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో మొత్తాన్ని చూస్తే… కొంత మంది సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా వుంది. అందుకే వైసీపీ మేనిఫెస్టో అందరిదీ కాదు…. కొందరిదే అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.
అనుకున్న బడ్జెట్లో అందరినీ సంతృఫ్తపరిచే అవకాశం ఉన్నా, ఆ పని ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. అందుకే వైసీపీ శ్రేణుల్లో మేనిఫెస్టో జోష్ నింపకపోగా, తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇలాగైతే ఏమవుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు వైసీపీ మేనిఫెస్టో కూటమిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. జగన్‌కు తనకు తానే శత్రువు అనే కామెంట్‌ను… తాజా మేనిఫెస్టో రుజువు చేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.