బెట్టింగ్ యాప్‌ల‌పై ఏపీ స‌ర్కార్ మౌన‌మెందుకు?

మంచి ఆశ‌యం కోసం ఏపీ స‌ర్కార్ ఎందుకు ముందు రాలేద‌న్న‌ది ప్ర‌శ్న‌.

బెట్టింగ్ యాప్‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వుంది. అందుకే వివిధ రంగాలకు చెందిన సెల‌బ్రిటీల‌పై కేసులు పెట్టి, విచారించి, జైలుకు పంప‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతోంది. బెట్టింగ్ యాప్‌ల‌తో ముఖ్యంగా యువ‌త జీవితాలు నాశ‌న‌మ‌వుతున్నాయి. క్రికెట‌ర్లు, యాంక‌ర్లు, సినీ సెల‌బ్రిటీలు త‌దిత‌రులు బెట్టింగ్ యాప్‌ల‌పై ప్ర‌చారం చేస్తుండ‌డం, వాళ్లంతా తాము అభిమానించే వాళ్లు కావ‌డంతో స‌హ‌జంగానే యువ‌త అటు వైపు ఆక‌ర్ష‌ణ‌కు గురి అవుతోంది.

స‌మాజ విధ్వంసానికి కార‌ణ‌మ‌య్యే బెట్టింగ్ యాప్‌లను కూకటి వేళ్ల‌తో స‌హా పెక‌లించాల్సిన అవ‌స‌రం వుంది. దీనిపై ఎవ‌రో ఒక‌రు న‌డుం బిగించాల్సిన అవ‌స‌రాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ స‌జ్జ‌నార్ గుర్తించారు. దీంతో మొద‌ట హెచ్చ‌రిక‌తో ప్రారంభించి, ఆ త‌ర్వాత కేసుల‌తో వేగంగా పావులు క‌దిపారు. స‌జ్జ‌నార్ దెబ్బ‌తో సెల‌బ్రిటీల‌పై కేసులు, విచార‌ణ నిమిత్తం వాళ్లంతా పంజాగుట్ట పీఎస్‌కు క్యూ క‌ట్టాల్సి వ‌చ్చింది.

ఏపీలోని ఇన్‌ప్లూయ‌న్స‌ర్లు లోక‌ల్ బాయ్ నాని, బిగ్‌బాస్ సెల‌బ్రిటీ టేస్టీ తేజ త‌దిత‌రుల‌పై తెలంగాణ‌లో కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. మంచి ఆశ‌యం కోసం ఏపీ స‌ర్కార్ ఎందుకు ముందు రాలేద‌న్న‌ది ప్ర‌శ్న‌. తెలంగాణ‌లో మాదిరిగా ఏపీ ప్ర‌భుత్వం కూడా బెట్టింగ్ యాప్‌ల‌పై ప్ర‌చారం చేసేవాళ్ల‌పై కేసులు పెట్టాల‌న్న ఆలోచ‌న ఎందుకు చేయ‌లేద‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

బెట్టింగ్ యాప్‌ల‌పై ప్ర‌చారం చేసేవాళ్ల‌పై కేసులు పెట్టి, ఎవ‌రూ న‌ష్ట‌పోకుండా చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది క‌దా? ఆ దిశంగా ఏపీ స‌ర్కార్ కూడా ఆలోచించి వుంటే అభినంద‌న‌లు అందుకునేది. కానీ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వివిధ రంగాల సెల‌బ్రిటీలకు మంచి కావ‌డం కోసం, సామాన్యులు న‌ష్ట‌పోయినా ఫ‌ర్వాలేద‌ని ప్ర‌భుత్వం అనుకుంటోందా? అనే అనుమానం లేక‌పోలేదు.

9 Replies to “బెట్టింగ్ యాప్‌ల‌పై ఏపీ స‌ర్కార్ మౌన‌మెందుకు?”

  1. చెప్పండి బెట్టింగ్ అప్స్ పై గత ఏపీ సర్కార్ మౌనమెందుకు? బెట్టింగ్ అప్స్ కి ప్రచారం 2019 జూన్-2024 మే మధ్య జరగలేదా… అప్పటి ప్రభుత్వం ఎవ్వరి మీద యాక్షన్ తీసుకుందో చెప్తే తెలుసుకుంటాము…. అంటే సామాన్యులు నష్టపోయినా పర్వాలేదని అప్పటి ప్రభుత్వం అనుకుందా? అప్పటి ప్రభుత్వం అలా చేసి ఉంటె అభినందనలు అందుకునేది….. కానీ ఏమి చేసియకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది….

  2. చేస్తే కక్ష్య సాధింపు అంటారు..

    చేయకపోతే ఏందుకు చేయలేదు అంటారు..

    పార్టీ అధికార ప్రతినిధి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అద్యచ్చా..

Comments are closed.