సినిమాల్లో డాన్సులపై వార్నింగ్

మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి

మొన్నటికిమొన్న డాకు మహారాజ్ లో పాటపై చాలా విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలా బ్యాక్ పై కొడుతూ బాలకృష్ణ వేసిన స్టెప్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. అంతకంటే ముందే మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ తో రవితేజ వేసిన స్టెప్ పై కూడా అభ్యంతరాలు తలెత్తాయి.

ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా ఆ పద్ధతిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లింది. “అదిదా సర్ ప్రైజు” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో హీరోయిన్ కేతిక శర్మతో వేయించిన డాన్స్ మూమెంట్ అందరికీ తెలిసే ఉంటుంది.

ఇప్పుడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినిమా పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, “మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి” అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది కమిషన్.

కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచేవిధంగా ఉన్నాయంటూ పలు ఫిర్యాదులు అందాయని తెలిపిన మహిళా కమిషన్.. దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది.

యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, టాలీవుడ్ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన కమిషన్.. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చని తెలిపింది. సరిగ్గా రాబిన్ హుడ్ విడుదలకు ముందు మహిళా కమిషన్ నుంచి ఈ హెచ్చరిక వచ్చింది

5 Replies to “సినిమాల్లో డాన్సులపై వార్నింగ్”

Comments are closed.