కొలిక‌పూడి అవినీతిపై జ‌న‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

మ‌ట్టి, మ‌ద్యంలో ఎమ్మెల్యేకు వాటా ఎంతో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు నిత్యం వార్త‌ల్లో వుంటారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఇటు టీడీపీలోని సీఎం బాబు సామాజిక‌వ‌ర్గంతోనూ, అటు ఆ పార్టీ అనుకూల మీడియాతోనూ ఆయ‌న‌కు గొడ‌వ జ‌రుగుతోంది. ఎమ్మెల్యే కొలిక‌పూడి కాస్త స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించ‌డం …పార్టీ త‌మ‌ది అని భావించే వాళ్ల‌కు అస‌లు న‌చ్చ‌డం లేదు. దీంతో ఆయ‌న్ను ఎలాగైనా బ‌య‌టికి పంపాల‌నే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు కొలిక‌పూడి వ్య‌వ‌హార శైలి కూడా వాళ్ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా వుంది.

ఈ నేప‌థ్యంలో కొలిక‌పూడి అవినీతిపై కూట‌మిలో భాగ‌స్వామ్య‌మైన జ‌న‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరువూరు జ‌న‌సేన స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌నుబోలు శ్రీ‌నివాస‌రావు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌న్నారు. మ‌ట్టి, మ‌ద్యంలో ఎమ్మెల్యేకు వాటా ఎంతో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వ‌ద్ద ఎమ్మెల్యే రూ.2 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన‌ట్టు త‌న వ‌ద్ద పూర్తి స‌మాచారం వుంద‌ని ఆయ‌న ఆరోపించారు. విద్యుత్‌శాఖ‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగానికి ఒక్కొక్క‌రి నుంచి రూ.6 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడ‌ని ఎమ్మెల్యేపై జ‌న‌సేన స‌మ‌న్వ‌య‌క‌ర్త సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు బాధితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

తిరువూరు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోప‌ణ‌లు వైసీపీ నేత‌లు చేసిన‌వి కావు. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్ష‌మైన జ‌న‌సేన స‌మ‌న్వ‌య‌క‌ర్త చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఎమ్మెల్యే డ‌బ్బు వ‌సూలు చేయ‌డంపై ఫిర్యాదు చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. కొలిక‌పూడిని ప్ర‌భుత్వం ఏం చేస్తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కార‌ణాలేవైనా కొలిక‌పూడిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

2 Replies to “కొలిక‌పూడి అవినీతిపై జ‌న‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు”

Comments are closed.