ఒడిశాకు ఉచిత ఇసుక.. అక్రమార్కులకు కాసుల పంట

ఉచిత ఇసుక ఇలా అక్రమంగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా చూడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుక బంగారం అంటే ఇదే మరి. ఇక్కడ ఇసుక ఉచితం, అదే అక్కడికి తరలిస్తే కాసులను నింపుకోవడమే. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇసుక అక్రమార్కులు కొందరు పక్కనే ఉన్న ఒడిషాకు ఉచిత ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ అక్రమ రవాణా యధేచ్చగా సాగిపొతోంది. ఇక్కడ తనిఖీలు పెద్దగా లేకపోవడం కలసి వస్తోంది.

వంశధార నది నుంచి ఇసుకను తవ్వేసి ట్రాక్టర్లకు ఎత్తేసి పొరుగు రాష్ట్రంలో ట్రాక్టర్ ఇసుకను నాలుగు నుంచి అయిదు వేల రూపాయలకు అమ్మేస్తూ ఇసుకాసురులు జేబులు నింపుకుంటున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల మీదుగా ఈ అక్రమ ఇసుక ఒడిశాకు తరలిపోతోంది. హిరమండలం, కొత్తూరు మండలాలలో ఇసుకను భారీ స్థాయిలో తవ్వేస్తున్నారు.

ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేనప్పటికీ ఇసుకాసురులు మాత్రం ఇష్టారీతిన తవ్వకాలు చేస్తూ తమ పంట పండించుకుంటున్నారు.

సిక్కోలు ఇసుక ఒడిశాకు తరలిపోవడంతో అక్కడ ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్ తగ్గిపోయింది. ఉచిత ఇసుక అక్కడ ఖరీదు చేస్తూంటే అక్కడి ఇసుక‌ కాస్తా ఎక్కువ ధర కావడంతో జనాలు ఇటు వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఉచిత ఇసుక ఇలా అక్రమంగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా చూడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

3 Replies to “ఒడిశాకు ఉచిత ఇసుక.. అక్రమార్కులకు కాసుల పంట”

Comments are closed.