తనకు లభించిన స్పీకర్ పదవి మీద సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంతృప్తిగా ఉన్నారా అంటే ఆయన నిత్యం మీడియాలో ఉండే మనిషి. ఆయన చాలా దూకుడుగా రాజకీయం చేసే నైజం కలిగిన వారు. అటువంటి ఆయనను స్పీకర్ అని చెప్పి మాట్లాడనీయకుండా కట్టి పడేశారు అన్నదైతే అనుచరులలో ఉంది అంటారు.
అయ్యన్నపాత్రుడు కూడా స్పీకర్ అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తన నోటికి ప్లాస్టర్ వేశారు అని చమత్కరించారు. అయితే ఆ చమత్కారం వెనక ఇంకా ఏమైనా దాగి ఉన్నాయా అన్న చర్చకు సైతం తెర లేచింది.
ఈ నేపధ్యంలో మాజీ ఉప రాష్ట్రపత్రి ఎం వెంకయ్యనాయుడు విశాఖ పర్యటనలో భాగంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన బాడీ లాంగ్వేజ్ కి స్పీకర్ కుర్చీకి అసలు సరిపడదు అని ఆయన సరదాగా అన్నారు.
అయినా సరే గౌరవనీయమైన స్పీకర్ చెయిర్ కి తాను ఏ మాత్రం గౌరవం తగ్గించకుండా పనిచేస్తాను అని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉంటేనే హాయి అని అంటున్నారు. ఆయన ఇప్పటికి చాలా సార్లు మంత్రిగానే పనిచేశారు.
స్పీకర్ పదవి లేకపోయినా ఆయన మాజీ మంత్రిగా రాజకీయాల గురించి తన ఆలోచనల గురించి మాట్లాడేవారు. ఆ స్వేచ్ఛ ఆయనకు అపుడు ఎక్కువగా ఉండేది. తన సొంత ప్రభుత్వంలో తప్పులు జరిగినా అయ్యన్న మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
బహుశా అలాంటి పరిణామాలను ముందే ఊహించారో ఏమో టీడీపీ పెద్దలు అయ్యన్నను గౌరవనీయమైన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టేశారు అని అంటున్నారు. స్పీకర్లుగా చేసిన వారి రాజకీయ జీవితం కూడా అక్కడితోనే ఆగిపోతుందని చరిత్ర నిరూపించింది. ఒక్క యనమల రామక్రిష్ణుడే దానిని మినహాయింపు. ఈ నేపథ్యంలో అయ్యన్న స్పీకర్ బాధ్యతలు అయిదేళ్ల పాటు నిర్వహిస్తూ తన రాజకీయ జీవితానికి గౌరవనీయమైన ముగింపు పలకాల్సిందే అని అంటున్నారు.