బాబు స‌ర్కార్‌కు హైకోర్టులో షాక్‌!

వేర్వేరు కేసుల్లో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది.

వేర్వేరు కేసుల్లో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. రేష‌న్ బియ్యం అక్ర‌మ త‌ర‌లింపు కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి, అలాగే కాకినాడ సీ పోర్టు వ్య‌వ‌హారంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడైన విక్రాంత్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్ ల‌భించింది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వానికి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది.

మ‌చిలీప‌ట్నంలో పేర్ని నాని భార్య పేరుతో ఉన్న గోడౌన్ నుంచి రేష‌న్ బియ్యం మాయ‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జ‌య‌ప్ర‌ద‌కు గ‌తంలోనే ముంద‌స్తు బెయిల్ ల‌భించింది. ఇదే కేసులో గోడౌన్ మేనేజ‌ర్‌తో స‌హా మ‌రో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్లంతా బెయిల్‌పై బ‌య‌టికి వచ్చారు.

అయితే రాజ‌కీయంగా పేర్ని నాని కూట‌మికి ప్ర‌ధాన టార్గెట్‌. ఈ నేప‌థ్యంలో పేర్ని నాని ఆదేశాల మేర‌కే అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు మ‌చిలీప‌ట్నం తాలూకా పోలీసులు ఆయ‌నపై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో ఆయ‌న ఏ6 నిందితుడు. ఎలాగైనా పేర్నిని అరెస్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్లింది.

దీంతో ముంద‌స్తు బెయిల్ కోసం పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం తీర్పు రిజ‌ర్వ్‌లో ఉంచింది. ఇవాళ తీర్పు వెలువ‌డింది. పేర్ని నానికి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

ఇదిలా వుండ‌గా కాకినాడ సీ పోర్టు, సెజ్‌లో వాటాలు బ‌ల‌వంతంగా లాక్కున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసింది. దీంతో త‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని, బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే విక్రాంత్‌రెడ్డిని క‌స్టోడియ‌ల్ విచార‌ణ‌కు అప్ప‌గించాల‌ని, ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కొట్టి వేయాల‌ని న్యాయ‌స్థానాన్ని సీఐడీ కోరింది.

ఈ నేప‌థ్యంలో సీఐడీ వాద‌న‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. విక్రాంత్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇద్ద‌రు వైసీపీ ముఖ్య నాయ‌కుల‌కు ఒకేరోజు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డం ఆ పార్టీకి గొప్ప ఊర‌ట. ఇదే సంద‌ర్భంలో కూట‌మి స‌ర్కార్‌కు గ‌ట్టి షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

4 Replies to “బాబు స‌ర్కార్‌కు హైకోర్టులో షాక్‌!”

  1. మ‌చిలీప‌ట్నంలో పేర్ని నాని భార్య జ‌య‌ప్ర‌ద‌ పేరుతో ఉన్న గోడౌన్ నుంచి రేష‌న్ బియ్యం మాయ‌మ‌య్యాయి , కాకినాడ సీ పోర్టు, సెజ్‌లో వాటాలు బ‌ల‌వంతంగా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి లాక్కున్నార‌నే సీఐడీ కే!సు న‌మోదు చేసింది అని నువ్వు రాసావు కదా , అయినా వాళ్ళని వేరే అక్రమాలలో పోలీసులు ఎత్తు తారు సంబరపడకు

Comments are closed.