రకరకాల కుత్సిత ప్రయోజనాలు ఆశించి.. భారతీయ జనతాపార్టీ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, ప్రలోభపెట్టి వారి కాళ్లు పట్టుకుని మరీ చంద్రబాబునాయుడు ఎన్డీయేలోకి తిరిగి ఎంటర్ అయ్యారు. చంద్రబాబునాయుడు, బిజెపి మధ్య పొత్తులు కుదిర్చడానికి తాను తిట్లు కూడా తిన్నానని పవన్ కల్యాణ్ స్వయంగా బహిరంగ వేదికమీదనుంచే చెప్పుకున్నారు.
ఇంత కష్టపడి కుదుర్చుకున్న బిజెపి ద్వారా ఆశించే ఇతర ప్రయోజనాలు ఏవైనప్పటికీ.. వారివల్ల తమకు ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందనే భయం చంద్రబాబులో పుష్కలంగా కనిపిస్తోంది. ముస్లింలను దువ్వడానికి ఆయన దాదాపుగా ప్రతి సభలోనూ ప్రయత్నిస్తున్నారు.
‘మేము భాజపాతో పొత్తు పెట్టుకున్నందుకు సీఎం జగన్ ముస్లిములను రెచ్చగొడుతున్నారు’ అంటూ చంద్రబాబు ఆక్రోశిస్తున్నారు. భాజపాతో అంటకాగడం మొదలైన తర్వాత.. ముస్లిం వర్గాన్ని ఒకరు రెచ్చగొట్టడం అవసరమా? మోడీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న వైనాన్ని జగన్ చెప్పకపోతే.. ముస్లింలు గుర్తించలేరా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
చంద్రబాబునాయుడు ముస్లింలను దువ్వడానికి సరిపడా చెప్పడానికి మాటలు దొరకడం లేదు. అందుకు బదులుగా.. పార్లమెంటులో బిల్లులకు ఇంతకాలం మద్దతిచ్చి ఇప్పుడు నాటకాలాడుతున్నారంటూ ఆయన జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటులో బిల్లులు పెట్టినప్పుడు.. తెలుగుదేశం కూడా బిజెపికే మద్దతిచ్చింది కదా.. అప్పుడేమైనా ఆ బిల్లులను వ్యతిరేకించి.. తాము ముస్లింలను ప్రేమించే పార్టీ అని తెలుగుదేశం ఎన్నడైనా నిరూపించుకుందా? అనేది ప్రజల సందేహం.
మోడీ అంటేనే ముస్లిం మతస్తుల్ని ఒక రకమైన అభద్రతకు, భయానికి గురిచేసే ఫ్యాక్టర్ గా ఈ దేశంలో ముద్రపడ్డారు. అలాగని ప్రతి ముస్లిం మోడీని ద్వేషిస్తున్నారని అనడానికి కూడా వీల్లేదు. ముస్లింలలో ఆయనను ప్రేమించే వారు కూడా ఉన్నారు. ఆయనను బతిమాలి మరీ ఆయనతో పొత్తు పెట్టుకున్నందుకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరమూ లేకుండానే.. చంద్రబాబును కూడా వర్గశత్రువుగా భావించే వారు కొందరు ముస్లింలలో తప్పకుండా ఉంటారు.
ముస్లింలకు తన మీద నమ్మకం కలిగించడానికి.. బిజెపి ముస్లిం వ్యతిరేక పార్టీ కాదని చెప్పగల ధైర్యం చంద్రబాబుకు ఉన్నదా అనేది కూడా ప్రజలకు కలుగుతున్న సందేహం.