వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దిగొచ్చారు. వాలంటీర్లపై గతంలో ఇష్టానుసారం నోరు పారేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు భారీ ఆఫర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అదేం ఉద్యోగం …గోనె సంచులు మోసేదా? ఆడవాళ్లు ఇంట్లో ఒంటరిగా వుంటే, వాలంటీర్లు వెళ్లి తలుపులు తడుతున్నారని తీవ్ర విమర్శలు చేసిన మనిషే… అబ్బే ఆ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాము ముందే చెప్పామన్నారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న రూ.5 వేల పారితోషికాన్ని రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తామని బాబు ప్రకటించడం విశేషం. ప్రజలకు సేవ చేస్తే వారికి అండగా వుంటామన్నారు.
ఇటీవల వాలంటీర్ల విషయంలో టీడీపీ బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. పింఛన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవద్దంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఫిర్యాదు ఆధారంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని ఈసీ అడ్డుకుంది.
దీంతో పెన్షనర్లు, అలాగే వాలంటీర్లంతా టీడీపీకి వ్యతిరేకంగా మారారు. ఈ వ్యతిరేకత రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాలంటీర్లకు రూ.10 వేలు పారితోషికం ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన ఎంత వరకు ఎన్నికల్లో లాభిస్తుందో చూడాలి.