ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించడానికి, అమరావతి అనే అంశం చుట్టూ ఎన్ని రకాల నిందలు తయారు చేయవచ్చునో.. అన్నీ చేశారు. పాత కొత్త బొమ్మలు చూపిస్తూ ప్రకటనల్లాగా వివరించి చెప్పారు.
ఇదంతా బాగానే ఉంది. ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత.. శ్వేతపత్రం అనే పదం చెప్పిందంటేనే.. కొత్త పాలకుల మీద బురద చల్లడానికి సిద్ధమవుతున్నారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. అందులో వింత లేదు. కానీ.. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న కొత్త లక్ష్యాలు ఏమిటి? ఇవేమీ ఆయన మాటల్లో ప్రజలకు అంతు చిక్కడం లేదు.
చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో కొన్ని రోజుల కిందట ఒక జాగ్రత్త తీసుకున్నారు. రాజధానిగా అమరావతిని ప్రభుత్వ గెజిట్ లో నోటిఫై చేశారు. జగన్ అమరావతిని విస్మరించిన తర్వాత.. అమరావతి రాజధాని అనే సంగతి అసలు రికార్డుల్లో ఎక్కడా లేనేలేదని, గెజిట్ నోటిఫికేషన్ కూడా లేదని వాదించిన సంగతి తెలిసిందే. కేంద్రం కూడా ఈ విషయంలో ఇలాంటి వాదనే ఓసారి ప్రస్తావించింది. దీంతో ఆ పని ముందుగా చేశారు చంద్రబాబు. దాదాపు రెండువేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలుండే రాజధాని నిర్మాణం అని ప్రకటించారు.
తీరా ఇప్పుడు శ్వేతపత్రం పేరుతో సాగించిన రాజకీయ ప్రసంగంలో.. చంద్రబాబు.. అసలు ఈ రాజధాని నిర్మాణాలను పూర్తి చేయడానికి తాను నిర్ణయించుకున్న గడువు ఏమిటో చెప్పలేదు. కనీసం ఎప్పటిలోగా ప్రజలు ఆశించవచ్చో కూడా చెప్పలేదు. ఒక్క కొత్త ఆలోచన కూడా ఈ రాజధాని ప్రాజెక్టుకు జత చేయలేదు.
‘కొత్త ప్రణాళికలు ఏమీ లేవని .. పాతవాటినే కొనసాగిస్తూ నిర్మాణం పూర్తిచేస్తామని’ అన్నారు. ఎఫ్పటికి? అనేది మాత్రం చెప్పలేదు. తన పాత ప్రభుత్వ హయాంలో 70-80 శాతం చాలా భవనాలు పూర్తయ్యాయని అంటున్న చంద్రబాబు.. ఆ భవనాలనైనా రాబోయే అయిదేళ్లలో పూర్తిచేస్తాను అనే మాట కూడా చెప్పలేదు.
చూడబోతే.. మళ్లీ ఒక రకమైన డ్రామాను.. అమరావతి అనే ప్రాజెక్టుచుట్టూ అల్లుతున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. శ్వేతపత్రం రూపంలో ప్రజలకు, భూములు ఇచ్చిన రైతులకు- అమరావతి రాజధాని గురించి, ఎలాంటి కొత్త ఆశలు కల్పించలేకపోగా.. కేవలం జగన్ ను నిందించడానికే చంద్రబాబునాయుడు పరిమితం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.