ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అనే ఆధునిక రాజకీయ నీతికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబునాయుడు. తప్పు తనవైపు ఉన్నప్పుడు.. అదే తప్పును తన రాజకీయ ప్రత్యర్థుల మీదికి పులిమేస్తూ మరింత రెచ్చిపోయి మాట్లాడ్డంలో చంద్రబాబును మించిన వారు లేరు.
పింఛన్లు తీసుకునే ముసలి వాళ్లకు ఇళ్లదాకా డబ్బులు వెళ్లనివ్వకుండా అడ్డుపడి.. ముప్ఫైమందికి పైగా అవ్వతాతల ప్రాణాలు బలితీసుకున్న చంద్రబాబునాయుడు, ఈ చావులన్నీ కూడా జగన్ పుణ్యమే అంటూ ఎంతగా ఎదురుదాడి చేస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు.
అదే విధంగా ప్రత్యేకహోదా విషయంలో కూడా చంద్రబాబునాయుడు మరియు ఆయన కోటరీ, ఆయన కీ ఇవ్వడంతో మాట్లాడుతున్న వారు అందరూ కూడా జగన్ ను నిందిస్తున్నారు. అయితే ఈ మాదిరిగా ప్రత్యేకహోదా విషయంలో జగన్ మీద నిందలు వేయడం కరక్టేనా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.
2019 ఎన్నికల సమయంలో పాతిక మంది ఎంపీలను తమ పార్టీ తరఫున గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజం. గెలిచిన తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి ప్రత్యేకహోదా కోసం విన్నవించారు గానీ పని జరగలేదు. అవున్నిజమే.. ఆయన ముందు చెప్పినట్టుగా ‘కేంద్రం మెడలు వంచడం’ అనేది చేయలేకపోయారు.
కానీ ఇక్కడ ఒక సంగతి గమనించాల్సి ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్మొహమాటంగా విషయాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పారు. ‘‘మనకు మెజారిటీ ఎంపీ సీట్లు దక్కితే.. కేంద్రం మెడలు వంచగలం అని అనుకున్నాను. మన బలం మీద ఆధారపడేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకున్నాను. కానీ.. బిజెపి ఒక్కరికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వానికి తగినంత బలం వచ్చింది. మనం గట్టిగా అడగలేని పరిస్థితి. ఏమీ చేయలేకపోయాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనుకుంటే.. బిజెపి ఎక్కువ సీట్లలో ఓడిపోవాలని కోరుకుందాం.. కనీసం ఈసారైనా మన బలం మీద ఆధారపడే ప్రభుత్వం ఏర్పడాలని అనుకుందాం.’’ అని జగన్ తేల్చి చెప్పారు.
చంద్రబాబునాయుడు ఏ విషయంలోనైనా ఇంత నిజాయితీగా వైఫల్యాన్ని ఒప్పుకున్న, వాస్తవం ప్రజలకు ఎరుకపరచిన ఘట్టం ఆయన నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఉన్నదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత విపులంగా చెప్పన తర్వాత జగన్ ను నిందించి ఉపయోగం లేదు. అయితే చంద్రబాబునాయుడును మాత్రం నిందించి తీరాలి. కేంద్రంలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉండగా.. ఆయన ఎందుకు హోదా సాధించలేకపోయారు? కేవలం డబ్బురూపంలో అందే ప్యాకేజీలకోసం రాష్ట్ర విస్తృతప్రయోజనాలకు మూలం కాగల హోదాను తుంగలో తొక్కిన దుర్మార్గం చంద్రబాబుది కాదా అని ప్రజలు అడుగుతున్నారు.
హోదా కోసం పోరాడే వారి మీద కేసులు పెడుతూ.. ఆ డిమాండ్ రాష్ట్రంలో వినిపించకుండా తొక్కేసిన ఘనత చంద్రబాబుది. అలాంటి బాబు.. ఇప్పుడు హోదా విషయంలో జగన్ ను కార్నర్ చేయాలని చూడడం చిత్రంగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.