మంత్రి కొలుసు పార్థసారథి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరూ టీడీపీ ప్రజాప్రతినిధులు కావడంతో, వాళ్ల మధ్య విభేదాలు ఆ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఈ నెల 18న మంత్రి పార్థసారథి పుట్టిన రోజు పురస్కరించుకుని గన్నవరంలో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఈ ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇలాంటి చిల్లర పని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అనుచరులదే అయి వుంటుందని మంత్రి అభిమానులు విమర్శిస్తున్నారు. యార్లగడ్డతో తాడోపేడో తేల్చుకుంటామని వాళ్లు హెచ్చరిస్తున్నారు. కొంతకాలంగా మంత్రి పార్థసారథి, యార్లగడ్డ మధ్య నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ వ్యవహారంపై విభేదాలు నడుస్తున్నాయి.
పెద్ద సంఖ్యలో వాహనాలు తన నియోజకవర్గం మీదుగా గ్రావెల్‌ను తరలిస్తున్నాయని వెంకట్రావ్ మూడు నెలల క్రితం చేసిన ఆరోపణలు చేశారు. యార్లగడ్డకు దీటుగా మంత్రి కౌంటర్ ఇచ్చారు. అబద్ధ సమాచారంతో, అలాగే అవగాహన లోపంతోనే యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా అనుమతులు తీసుకుని, మైనింగ్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డకు పంపుతానని కూడా అప్పట్లో మంత్రి తెలిపారు.
కానీ విభేదాలు మాత్రం వాళ్లిద్దరి మధ్య కొనసాగుతూనే వున్నాయి. అందుకే మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కొలుసు అభిమానులు ప్లెక్సీ పెట్టగా, దాన్ని చించివేశారని వాళ్లు మండిపడుతున్నారు. ఇలా టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య ప్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.