వంచించడం చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ప్రత్యర్థుల ఆరోపణల్లో నిజం ఉందని కొన్ని ఘటనలు నిరూపిస్తుంటాయి. తాజాగా చంద్రబాబు ఓ రియల్టర్, టీడీపీ సానుభూతిపరుడిని మోసగించిన విధానంపై అన్నమయ్య జిల్లాలో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా షాజహాన్‌బాషాను ఎంపిక చేశారు. దీంతో షాజహాన్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మదనపల్లె నియోజకవర్గ ఓటర్లకు చంద్రబాబు వాయిస్‌తో ఫోన్‌కాల్ వెళ్లింది. మదనపల్లె టీడీపీ అభ్యర్థి జయరామనాయుడు అయితే ఒకటి నొక్కండి, నోటా అయితే రెండు నొక్కాలని ఆ ఐవీఆర్ఎస్ కాల్ సారాంశం. దీంతో టీడీపీ అభ్యర్థి షాజహాన్ , ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇదేంటి, ప్రచారం చేసుకుంటుంటే, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారనే షాజహాన్, ఆయన అనుచరులు ఆందోళన చెందారు.
మదనపల్లె టీడీపీ అభ్యర్థిని మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే వెనుక అసలేం జరిగిందని ఆరా తీయగా, ఆశ్చర్యం కలిగించే నిజాలు వెలుగు చూశాయి.
మదనపల్లెకు చెందిన జయరామనాయుడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావించారు. చంద్రబాబును టికెట్ కూడా అడిగారు. అయితే అప్పట్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత కాలంలో రానున్న ఎన్నికల్లో మదనపల్లె టికెట్ ఇస్తానని జయరామనాయుడికి బాబు చెప్పారు. మదనపల్లెలో పార్టీ కోసం ఖర్చు పెట్టాలని సూచించారు.
దీంతో జయరామనాయుడు మదనపల్లెలో టీడీపీ కోసం తన వంతుగా ఖర్చు పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి, ఎన్నికల సమయానికి పట్టించుకోలేదని బాబును ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో మదనపల్లె అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చంద్రబాబు తన మార్క్ వ్యూహానికి తెరలేపారు. జయరామనాయుడు పేరుతో సర్వే చేయించారు. ఇక్కడే అసలు మతలబు వుంది.
టికెట్ ఇవ్వడానికి సర్వే చేయించారనే భ్రమను జయరామనాయుడిలో కల్పించే ఎత్తుగడగా చెబుతున్నారు. సర్వేలో బాగా రాలేదని చెప్పి, టికెట్ ఇవ్వలేనని జయరామనాయుడికి చెప్పేందుకు చంద్రబాబు ఆడిన డ్రామానే ఐవీఆర్ఎస్ సర్వే అని అంటున్నారు. చంద్రబాబు బుర్రే బుర్ర అని వెటకారంగా సొంత పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.