ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆల్రెడీ నిల్వ ఉన్న ప్రాంతాల నుంచి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇసుక ఉచితం కాదని, షరతులు వర్తిస్తాయని చంద్రబాబు రాజగురువు పత్రిక బ్యానర్ కథనం తేల్చి చెప్పింది.
“ఖర్చులిస్తే చాలు… ఇసుక ఉచితం”.. సీనరేజ్, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తారని చంద్రబాబు సర్కార్‌ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చే పత్రిక ఉచిత రాతలు. ఒక వస్తువు ఫ్రీగానే ఇస్తాం, కానీ షరతులు వర్తిస్తాయని దుకాణదారుడు ప్రకటన ఇచ్చినట్టుగా, ఇసుక వ్యవహారం వుంది. ఇసుక ఉచితంగా ఇస్తారని, తెచ్చుకుందామని వెళ్లిన వారికి ఆశాభంగం ఎదురైంది. చంద్రబాబు ప్రభుత్వ మార్క్ మోసానికి గురయ్యామని అర్థమైంది.
ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోడానికి కనీసం రూ.4 వేలు, గరిష్టంగా ఆరు వేలకు పైబడి ఖర్చు చేయాల్సి వస్తోందని సామాన్య ప్రజానీకం వాపోతోంది. అందుకే ఖర్చులిస్తే చాలు అనే షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంబరానికి ఉచితం అని ఎన్నికల ప్రచారం చేసుకోవడం ఎందుకనే ప్రశ్న ఎదురవుతోంది. ఉచిత ఇసుక అంటూనే, సీనరేజ్, నిర్వహణ ఖర్చుల భారాన్ని సామాన్యులపై మోయలేని విధంగా మోపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నారు.
చంద్రబాబు పదేపదే ఇసుక ఉచితంగా ఇస్తామంటే నిజంగా ఇస్తారని నమ్మి ఓట్లు వేశామని, ఇప్పుడు మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఒక ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరా అంటూ ఊదరగొడుతుంటే, మరోవైపు ఇసుక డిపోల వద్ద టన్ను ఇసుక ఇసుక రూ.1,394 అంటూ ఒక్కోచోట ఒక్కో రేటు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. ఈ తంతు రహస్యంగా సాగడం లేదు.
ఉచిత ఇసుక టీడీపీ, అక్కడక్కడ జనసేన నాయకులకు మాత్రమే. అధికార పార్టీల నాయకులు టన్ను ఇసుకకు రేటు నిర్ణయించి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకు మించి ఉచిత ఇసుక అని ఎవరైనా అంటే… ఉత్త బోగస్ మాటలని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ఏదైనా చెబితే, అందులో తిరకాసు ఎలా వుంటుందో ఉచిత ఇసుక సరఫరానే నిదర్శనం అని జనం చర్చించుకుంటున్నారు.