వ్యవస్థలను మేనేజ్ చేయడం, ముసుగులు వేసుకున్న తమ వారితో తమ అజెండాలను అమలు చేయడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆది నుంచి అబ్బిన రాజకీయ విద్య! ఆయన రాజకీయ ఎదుగుదల అంతా అలాంటి వ్యూహాలతోనే జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షకులు, మీడియా, ఇతర వ్యవస్థల్లోని వ్యక్తులు.. ఇలా చంద్రబాబు వేసిన నాట్లు ఎన్నో చోట్ల ఉంటాయి. అవసరానికి అవి పని చేస్తూ ఉంటాయి!
అలాంటి వారిలో ఒకరైన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ ఫలితంగా ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. ఇది తమ విజయం అని చంద్రబాబు బృందం మొదట లెక్కేసింది! వలంటీర్లు పెన్షన్లు పంచితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి లాభం అనే లెక్కలతో వ్యూహాత్మక పిటిషన్లతో ఆ పంపిణీని ఆపేయించారు! కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి చందానా.. ఈ వ్యవహారంలో మొదట టీడీపీ కామ్ గా ఉండిపోయింది. అయితే పెన్షనర్లకు ఎప్పుడైతే ఆగ్రహావేశాలు కలిగాయో.. అప్పుడు చంద్రబాబుకు మెలకువ వచ్చింది!
ఈ వ్యవహారంపై ఆయన ఎదురుదాడి మొదలుపెట్టారు! అయితే.. ఇది ఇంకా 1995 అనే చంద్రబాబు అనుకుంటూ ఉన్నారు! అక్కడే ఆయనకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది 2024! అందునా చంద్రబాబు టక్కుటమార విద్యలన్నీ ప్రజలకు ఎరుకే! దీంతో ఆయన చంచాగిరి చేసే వాళ్లు చేసిన పని చంద్రబాబుపై ఆగ్రహంగా మారింది. వలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీని ఆపేయించింది చంద్రబాబే అనే విషయం వృద్ధులకు స్పష్టంగా అర్థం అయ్యింది. దీనిపై ఏప్రిల్ నెలారంభంలోనే పెన్షనర్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత డ్యామేజీ కవరేజ్ ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా జరిగాయి!
అందులో ఒకటి.. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని పదే పదే చెప్పడం, వారికి జీతాల పెంపు వంటివి! అయితే.. వాత పెట్టి వెన్న రాసినంతమాత్రన సరిపోదు! చంద్రబాబు బ్యాడ్ లక్ ఏమిటంటే.. మళ్లీ ఒకటో తేదీ వస్తోంది. పెన్షనర్లకు మళ్లీ ముప్పుతిప్పలు మొదలుకాబోతున్నాయి. ఈ సారి బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారట! అయితే ఆ డబ్బుల గురించి వృద్ధులు బ్యాంకుల ముందు క్యూలు కట్టాలి ఇక! ఆల్రెడీ దేశంలో ఏటీఎంల వ్యవస్థ సరేసరి! ఏ ఏటీఎం పని చేస్తోందో.. దేన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదో చెప్పడం ఎవరి తరం కాదు! అందునా ఎంతమంది వృద్దులకు ఏటీఎం కార్డులున్నాయి, వారిలో ఎంతమందికి డ్రా చేసుకునే నైపుణ్యం ఉందనేది కూడా ప్రశ్నార్థకమే! ఏతావాతా.. మే నెల పెన్షన్ విషయంలో కూడా వృద్ధులకు ముప్పుతిప్పలు తప్పేలా లేవు!
వలంటీర్ల ద్వారా వృద్ధులకు పెన్షన్లు అందితే అది తన రాజకీయానికి ప్రమాదం అని చంద్రబాబు భావించి దాన్ని కెళికించారు. ఇప్పుడు వృద్ధులకు మండుతోంది. మండుటెండల్లో వాళ్లకు చంద్రబాబు చుక్కలు చూపుతున్నారు. ఈ భయం చంద్రబాబుకు కూడా తీవ్రంగా ఉంది. అందుకే అందరికన్నా ముందుగా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. అయితే.. గిల్లి జోల పడినట్టుగా ఉంది చంద్రబాబు తీరు. అలా ఎందుకు చేయకుడదు, ఇలా ఎందుకు చేయకూడదు అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అయితే చంద్రబాబు తీరు పెన్షనర్ల పుండు మీద కారం జల్లుతున్నట్టుగా ఉంది!