సామాన్యులకే పెద్ద పీట అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 30న ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. దానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకుంది ఇంచార్జి మంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రి విశాఖ వచ్చి చందనోత్సవం గురించి ఏర్పాట్ల మీద ఆరా తీశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం సామాన్య భక్తులకే పెద్ద పీట అని అన్నారు.
వీఐపీలు ఎవరైనా తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ మాత్రమే అని స్పష్టం చేశారు. ఆ తరువాత క్యూ లైన్లలో ఉన్న సామాన్యులకే దర్శనం అని చెప్పారు. ఎవరైనా ఇదే విధానం అని ఆయన అంటున్నారు.
మంత్రి గారు చెప్పింది కనుక కచ్చితంగా అమలు అయితే ఈసారి చందనోత్సవం సామాన్య భక్తులకే వరం అవుతుంది. ప్రతీ సారి వేలాదిగా జనాలు వచ్చి కొండ మీద వేసవి ఎండలో పడి గాపులు కాస్తూ నానా అవస్థలు పడుతూ దర్శనం దొరకక ఎదురు చూస్తుంటారు.
ఈ మధ్యలోనే వీఐపీలు వరసగా దర్శనాలు చేసుకుంటారు. వారికి ఒక వేళా పాళా లేకుండా దర్శనాలు చేయించేవారూ ఉంటారు. దాంతోనే కొండవీటి చాంతాడు మాదిరిగా క్యూ లైన్లు పెరిగిపోతున్నా కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈసారి అలా కాదు అంతా మార్చామని మంత్రిగారు నమ్మకంగా చెబుతున్నారు. అదే కనుక జరిగితే మాత్రం అప్పన్న కరుణ సామాన్యుల మీద నిండుగా పడినట్లే అని ఆస్తిక జనులు అనుకుంటున్నారు.