టీడీపీతో పొత్తు…అక్క‌డ జ‌న‌సేన పోటీ అట‌!

ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు కూడా పెట్టేసింది జ‌న‌సేన‌. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉంద‌ని, అప్ప‌టి వ‌ర‌కూ పొత్తుల ప్ర‌స్తావ‌నే వ‌ద్ద‌ని టీడీపీ, బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఇప్పుడే…

ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు కూడా పెట్టేసింది జ‌న‌సేన‌. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉంద‌ని, అప్ప‌టి వ‌ర‌కూ పొత్తుల ప్ర‌స్తావ‌నే వ‌ద్ద‌ని టీడీపీ, బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఇప్పుడే పొత్తుపై ఏదో ఒక నిర్ణ‌యం జ‌రిగిపోతే, తాము రిలాక్ష్ అవుతామ‌ని జ‌న‌సేన ప‌రిత‌పిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీతో పొత్తు దాదాపు ఖ‌రారైన‌ట్టు, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న కూడా జ‌న‌సేన నాయ‌కుడు డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ చేస్తున్నారు.

తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు. ఆయ‌న పీఏసీ స‌భ్యుడు, రాజకీయ కార్యదర్శి కూడా. ఇవాళ ఈయ‌న ఈయ‌న ఒక అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే టీడీపీతో పొత్తు విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు జ‌న‌సేన అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ యుగంధ‌ర్ పోటీ చేస్తార‌ని డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కూ ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు.

కానీ తెలుగుదేశం పార్టీతో త‌మ పార్టీకి పొత్తు వున్నా, జీడీనెల్లూరు నుంచి పోటీ చేసేది మాత్రం డాక్ట‌ర్ యుగంధ‌ర్ మాత్ర‌మే అని హ‌రిప్ర‌సాద్ ప్ర‌క‌టించ‌డం విశేషం. పొత్తు ఉన్నా, లేకున్నా అత‌నే అభ్య‌ర్థి అని తేల్చి చెప్పాడు. గంగాధ‌ర‌నెల్లూరులో టీడీపీకి ఇంత వ‌ర‌కూ ఇన్‌చార్జ్ లేరు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన జీడీనెల్లూరుకు కోఆర్డినేట‌ర్‌గా భీమినేని చిట్టిబాబునాయుడిని నియ‌మించారు.

ఇక్క‌డి నుంచి వైసీపీ అభ్య‌ర్థి నారాయ‌ణ‌స్వామిపై మాజీ మంత్రి కుతూహ‌ల‌మ్మ కుమారుడు డాక్ట‌ర్ ఆన‌గంటి హ‌రికృష్ణ పోటీ చేశారు. నారాయ‌ణ‌స్వామి భారీ ఆధిక్య‌త‌తో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత నారాయ‌ణ‌స్వామి మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న డిప్యూటీ సీఎం కూడా. 

జీడీనెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీలు, రెడ్ల ఓట్లు అధికం. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టే ఉంది. డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ మాట‌లు వింటే… పొత్తు గురించి టీడీపీతో లోపాయికారి చ‌ర్చ‌లు జ‌రిపారేమో అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత బ‌హిరంగంగా టీడీపీతో పొత్తుపై డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ ప్ర‌క‌టించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.