ముందు సొంత పార్టీ గురించే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు మాత్రం టీడీపీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఆయన టీడీపీ నేతలను వైసీపీ సర్కార్ అణచివేస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషను విచారణ పేరిట సీఐడీ అధికారులు పిలిచి అంత సేపు విచారిస్తారా అని రాజు గారు వైసీపీ సర్కార్ మీద ఫైర్ అయ్యారు. ఇదేమి అన్యాయం, ఇదెక్కడి రాక్షస పాలన అని నిప్పులు చెరిగారు.
బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ఒక బీసీ మహిళ విషయంలో ఇంతలా వేధింపులు చేయడమేంటి అని మండిపడ్డారు. బీసీలు అంతా మూకుమ్మడిగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇక గౌతు శిరీష అంటే ఎవరు అనుకుంటున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు. ఆమె తండ్రి సీనియర్ నేత శివాజీతో తాను ఎమ్మెల్యేగా కలసి పనిచేశాను అని గుర్తు చేశారు.
అలాంటి కుటుంబం మీద వేధింపులా అని రాజు గారు అంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో పోస్టింగులు పెట్టారన్న దాని మీదనే శిరీషను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. తప్పు లేదని తేలితే వదిలేస్తారు. అయితే అసలు విచారణే వద్దు, బీసీ మహిళ, గౌతు ఫ్యామిలీ అని నీతులు చెప్పడం రాజు గారికి తగునా అని వైసీపీ నుంచి కామెంట్స్ వస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే టీడీపీతో దోస్తీ నై అని ఒక వైపు బీజేపీ పెద్దలు అంటున్న వేళ రాజు గారికి మాత్రం ఆ పార్టీ నాయకుల మీద ఎందుకంత ప్రేమ అన్న పాయింటుని కూడా పట్టుకుని లాగుతున్నారు. అయినా రాజు గారు తన అభిమానాన్ని దాచుకోలేకపోతున్నారా లేక సాటి విపక్షం మీద ఏమిటీ వేధింపులు అని సానుభూతితో నిలదీస్తున్నారా. ఆయనకే తెలియాలి.