ఆ వారసత్వ పోరు వైసీపీకి చేటు చేసింది!

కూటమి పార్టీలకు కోరం దక్కేది కాదు. ఊహించని విధంగా తిరిగిన మలుపులతో వైసీపీ విశాఖను చేజార్చుకుందని ఆ పార్టీ వారే అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీతో వారి చేతిలో ఉన్న నగర కార్పొరేషన్ విశాఖపట్నం! ఇవాళ కూటమి పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అది కాస్తా వారి చేజారిపోయింది. అవిశ్వాస తీర్మానం సమావేశం జరగడానికే 74 మంది సభ్యుల హాజరు అనేది కోరంగా అవసరం కాగా, ఎక్స్ అఫీషియో సభ్యులతో సరిగ్గా 74 మంది మాత్రమే హాజరయ్యారు. వారి అవసరం గడిచింది.

అయితే.. బొటాబొటీగా ఎంత అవసరమో.. అంతేమందితో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా.. వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ.. పది నెలల పదవీకాలం మాత్రమే మిగిలిఉన్న స్థానంలో బీసీ మహిళను కుట్రతో దించేసారని వైసీపీ ఆరోపిస్తున్నది. అయితే ఇక్కడ ఎవ్వరూ గుర్తించని ఒక మతలబు కూడా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి పోరు, వారసత్వపు పోరు.. ఇవాళ విశాఖ కార్పొరేషన్ చేజారడానికి కారణమై వైసీపీ పుట్టిముంచింది. ఆ సంగతి వారు గుర్తించేసరికే పరిస్థితి చేయిదాటిపోయింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో గాజువాక అసెంబ్లీ సీటు నుంచి తిప్పల నాగిరెడ్డి గెలిచారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆయన దాదాపు 17 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. అలాంటి నాగిరెడ్డికి 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ నుఅక్కడ బరిలోకి దింపారు. ఆయన కూడా నెగ్గలేకపోయారు.. అది వేరే సంగతి.

అయితే.. తిప్పల నాగిరెడ్డికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు దేవన్ రెడ్డి కాగా, రెండో కొడుకు వంశీరెడ్డి. తండ్రి ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్న కొడుకు వంశీరెడ్డి విశాఖలో కార్పొరేటర్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ పతనం తర్వాత.. తిప్పల నాగిరెడ్డి.. తన రాజకీయ వారసుడు పెద్దకొడుకు దేవన్ రెడ్డి అని ప్రకటించారు. గాజువాకలో గుడివాడతో చేసిన ప్రయోగం వల్ల తలబొప్పికట్టిన వైఎస్సార్ కాంగ్రెస్, ఆ నియోజకవర్గానికి దేవన్ రెడ్డిని ఇన్చార్జిగా కూడా ప్రకటించారు.

ఈ రాజకీయ వారసత్వ ప్రకటన.. వంశీరెడ్డికి కోపం తెప్పించింది. తండ్రి మీద అలిగిన వంశీరెడ్డి.. నేరుగా కొణతల రామకృష్ణ వద్దకు వెళ్లి.. జనసేనలో చేరిపోయారు. ఈ పరిణామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద షాక్ అని చెప్పాలి. కొడుకు జనసేనలో చేరడం తనను ఆవేదనకు గురిచేసిందంటూ.. తిప్పల నాగిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా! ఆయన కుటుంబంలో వారసత్వపు పోరు.. ఇప్పుడే బయటపడకుండా ఉండిఉంటే గనుక.. వంశీరెడ్డి పార్టీ మారడం జరిగేది కాదు.

కూటమి పార్టీలకు కోరం దక్కేది కాదు. ఊహించని విధంగా తిరిగిన మలుపులతో వైసీపీ విశాఖను చేజార్చుకుందని ఆ పార్టీ వారే అంటున్నారు.

4 Replies to “ఆ వారసత్వ పోరు వైసీపీకి చేటు చేసింది!”

  1. మరి 11 రావడానికి కారణం కూడా అన్న చెల్లి వారసత్వ సమస్యే, లేకపోతే అన్నకి అసెంబ్లీ కి వెళ్ళాలంటే వనికే మన పోసిషన్ కాకుండా ఏ 20 వచ్చేయి

  2. మరి మన అన్న ఇంట్లో మొదలైన రచ్చ వైకాపా ని ముంచేయలేదా ???

Comments are closed.