వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జ్ జీవీ ప్రవీణ్‌రెడ్డికి సీనియర్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పొమ్మనకుండానే పొగ పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తర్వాత, ప్రొద్దుటూరులో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రవీణ్‌రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతల్ని చంద్రబాబు, లోకేశ్ అప్పగించారు.
2019-23 మధ్య కాలంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వేధింపుల్ని తట్టుకుని ప్రవీణ్ నిలబడ్డారు. పలు దఫాలు జైలుకు వెళ్లి రోజుల తరబడి ఊచలు లెక్కపెట్టారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్‌రెడ్డిని లోకేశ్ పరామర్శించారు. ప్రొద్దుటూరు టికెట్ ప్రవీణ్‌కే అని మీడియా సాక్షిగా లోకేశ్ ప్రకటించారు. జైలు నుంచి విడుదలయ్యాక ప్రవీణ్ రెట్టించిన ఉత్సాహంతో పని చేసుకెళ్లారు. ఆ తర్వాత కూడా హత్యాయత్నం కేసులో ప్రవీణ్ పరారయ్యారు.
సీన్ కట్ చేస్తే… పార్టీతో సంబంధం లేని వరదరాజులరెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ప్రవీణ్ మనస్తాపం చెందారు. రాజంపేట ఎన్నికల పర్యవేక్షకుడిగా నియమితులయ్యారు. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రవీణ్‌రెడ్డి ప్రొద్దుటూరు వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు, ప్రవీణ్ తన అనుచరుల్ని వైసీపీలో చేర్పించారనే ప్రచారం జరిగింది. ఎన్నికల్లో వరదరాజులరెడ్డి గెలుపొందారు.
సీన్ కట్ చేస్తే… చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ప్రొద్దుటూరులో మళ్లీ ప్రవీణ్ యాక్టీవ్ అయ్యారు. ప్రవీణ్ అధికార పార్టీ నేతగా పెత్తనం చెలాయించడాన్ని సీనియర్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తన అనుచరుల్ని వరదరాజులరెడ్డి మీడియా ముందుకు పంపారు. లోకేశ్ పేరు చెప్పి అధికారుల్ని బెదిరిస్తే సహించేది లేదని వరదరాజులరెడ్డి అనుచరులు హెచ్చరించారు. అసలు ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చావో అందరికీ తెలుసని వారు అంటున్నారు.
పది రోజుల్లో లోకేశ్, చంద్రబాబునాయుడి వద్దకెళ్లి.. పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించడంపై ఆధారాలతో సహా వివరిస్తామని వరదరాజులరెడ్డి అనుచరులు హెచ్చరించడం గమనార్హం. దీంతో రానున్న రోజుల్లో ప్రొద్దుటూరులో ప్రవీణ్‌రెడ్డి పరిస్థితి ఎలా వుంటుందో వరదరాజులరెడ్డి హెచ్చరికలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా ప్రవీణ్‌ను పార్టీ నుంచి బయటికి పంపేందుకు నంద్యాల వరదరాజులరెడ్డి పొగ పెడుతున్నారనే చర్చ ప్రొద్దుటూరులో విస్తృతంగా సాగుతోంది.