కరోనా వైరస్‌పై ఎదురు దాడికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. లాక్డౌన్ కబంధ హస్తాల నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటప డుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమవుతూ ఆర్థికంగా ఛిన్నాభిన్నమై జీవితాలను నాశనం చేసుకోవడం కంటే , దానిపై పోరాడడమే మంచిదనే నిర్ణయానికి ప్రభుత్వాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా స్తంభించిన జీవితాలను పునరుద్ధరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ నిబంధనలను అమలు చేస్తూ రోజువారీ జీవితాలను గాడిలో పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
దుకాణాలు తెరచుకుంటున్నాయి. నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే విపత్తు నుంచి తేరుకుంటోంది. సహజంగానే జనం గుమికూడే రంగాలు మాత్రం తెరచుకోడానికి ఇంకా కొంత సమయం తీసుకునేలా ఉంది. అందుకే సినిమా థియేటర్లు, అన్ని మతాల ప్రార్థనా లయాలు, షాపింగ్ మాల్స్ ప్రస్తుతానికి మూసే ఉంచుతారు. ప్రజారవాణా వ్యవస్థ రెండుమూడు రోజుల్లో రోడ్డెక్కనుంది.
ఈ నేపథ్యంలో ప్రధానంగా విద్యా సంస్థల గురించి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మార్చి రెండో వారం నుంచి ఏపీలో అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. ఈ నేపథ్యంలో స్కూళ్ల ఓపెనింగ్‌కు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆగస్టు 3 నుంచి తిరిగి బడిగంట మోగించేందుకు సీఎం జగన్ ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది.
జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు- నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ముందుగానే ప్రకటించిన 9 రకాల సదుపాలను కల్పించాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్షించాలని జగన్ ఆదేశించారు.