టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఆ ఆనందంలో అసలు ఆయనేం మాట్లాడారో, ఏం మాట్లాడాలనుకున్నారో కూడా గమనంలో లేదు. అసలే కరోనా కాలం…దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాజిటివ్ ప్రచారానికి బ్రహ్మాండమైన అవకాశం దొరికినప్పుడు బాబు చేజేతులా విడిచి పెట్టాడు. అవకాశాలు వచ్చినపుడే అందిపుచ్చుకోవాలనేది వ్యక్తిత్వ వికాసంలోని మౌళిక సూత్రం.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబుకు ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా? అందుకే చంద్రబాబు చేసిన బుద్ధి తక్కువ పనికి ఆయన పరమ భక్తుడైన ఆంధ్రజ్యోతి ఆర్కే చింతిస్తున్నాడు. నోట ముద్ద దిగడం లేదు. విలేకరుల సమావేశంలో మోడీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వెల్లడించే సందర్భంలో బాబు నోరు జారడంపై ఆర్కే అలకబూనాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో 14 ఏళ్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది కదా అని బాబును ఆర్కే అలా ఫ్రీగా విడిచి పెడితే….కొంప కూల్చాడని ఆర్కే తెగ బాధ పడిపోతున్నాడు.
హైదరాబాద్‌లో ఈవేళ చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా బాబు తనకు మోడీ ఫోన్ చేసిన విషయాన్ని ఎంతో సంబరంగా చెప్పుకొచ్చాడు. బాబు ముఖంలో ఆనందం చూస్తే…కరోనా పోయినట్టుగా ఉంది. ఆ సంతోష సమయంలో తానేం మాట్లాడుతున్నారో కూడా బాబుకు స్పృహలో లేనట్టుంది.
“నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశాను. మోడీతో మాట్లాడాలని అనుకున్నా. ఇవాళ ఉదయం 8.30కి ప్రధాని నాకు ఫోన్ చేశారు. ఆయనకు కొన్ని విధానపరమైన సూచనలు చేశాను. అంతకు ముందు ఆయన రాసిన లేఖలోనూ కొన్ని సలహాలిచ్చాను”….ఇలా సాగింది బాబు ప్రెస్‌మీట్.
అయితే ఇందులో తప్పేం ఉందంటారా? ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూస్తే తప్ప, బాబు చేసిన నిర్వాకం అర్థం కాదు. బాబు భక్తుడైన ఆర్కే ఎందుకంత శోకిస్తున్నాడో అర్థమవుతుంది.
“దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ ఉదయం ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి కరోనా కట్టడిపై నిశితంగా మాట్లాడారని బాబు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు తాము చేసిన అధ్యయనాలను నేరుగా వివరించానన్నారు”…. ఇదన్న మాట.
ఆంధ్రజ్యోతి వార్తలో ఎక్కడే కానీ నిన్న ప్రధాని కార్యాలయానికి చంద్రబాబు ఫోన్ చేసిన విషయం రాయలేదు. దాన్ని ఆంధ్రజ్యోతి దాచడంలో నిగూఢమైన ఉద్దేశం ఏంటో ఆర్కే చెప్పకనే చెప్పాడు.
ప్రధాని మోడీ దేశానికి మార్గనిర్దేశకుడైన చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి…. “అయ్యా కరోనా కట్టడి మా వల్ల కావడం లేదు. ఎన్నో విపత్తులను ఎదుర్కొన్న మేధా సంపన్నులు, అనుభవజ్ఞులు మీరు. కావున కరోనా మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలో సెలవివ్వండి మహాప్రభూ” అని ప్రధాని వేడుకున్నట్టు, మోడీ విజ్ఞప్తి మేరకు బాబు రంగంలోకి దిగినట్టు ప్రచారం చేసుకునే సువర్ణావకాన్ని…బాబు విడిచి పెట్టాడని ఆర్కే తీరని దుఃఖసాగరంలో మునిగిపోయాడు.
విలేకరుల సమావేశంలో చంద్రబాబు తాను నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశానని చెప్పిన ఒకే ఒక్క మాట ఎల్లో మీడియాకు తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. అందుకే మాట జారితే ఎంత అనర్థమో బాబు విషయంలో అర్థమైంది. ఒకవేళ విలేకరుల సమావేశంలో చంద్రబాబు తనకే ప్రధాని ఫోన్ చేశారని చెప్పి ఉంటే..ఎల్లో మీడియా హెడ్డింగ్‌లు ఎలా ఉండేవో ఊహించుకోండి.
బాబు ఇన్…కరోనా ఔట్; కరోనా కింగ్ బాబు; విపత్తులో వికసించిన బాబు మేధస్సు; దేశానికి అక్కరకొచ్చిన బాబు అనుభవం; బాబు సలహాల కోసం దేశం ఎదురు చూపు; బాబుతో అత్యవసర భేటీకి హైదరాబాద్‌కు మోడీ; ట్రంప్‌కు చిక్కని బాబు; లోకేశ్‌తో సరిపెట్టుకున్న అగ్రరాజ్యాధి నేత….ఇలా ఎల్లో మీడియాలో శీర్షికలుండేవి.
-సొదుం రమణ