మైనార్టీలు ఓట్లు వేయకపోయినా పర్లేదు, హిందువుల ఓట్లయినా గుంపగుత్తగా తమకే పడాలనే ఉద్దేశంతో గ్రేటర్ ప్రచారంలో హిందుత్వాన్ని భుజానికెత్తుకుంది బీజేపీ.
సర్జికల్ స్ట్రైక్స్ అంటూ జనాల్ని రెచ్చగొట్టి మరీ తాము అనుకున్నది కాస్తో కూస్తో సాధించగలిగారు బీజేపీ నేతలు. మరి ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా? ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఆ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందనే అనుమానం వస్తోంది.
ఏపీలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఒకాయని మరీ ఓవర్ గా మాట్లాడేశారు. ఇంకొక పెద్ద మనిషి.. మా హుండీ డబ్బులతో ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందంటూ రెచ్చిపోతున్నారు. దర్గాలకు, చర్చిలకు నిధులు ఎందుకిచ్చారంటూ లా పాయింట్ తీస్తున్నారు.
హిందువుల ఆలయాలకు నిధులివ్వండి, దేవాలయాల ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా చూడండి.. అనడం వరకు ఓకే, ఆ తర్వాత లిమిట్స్ క్రాస్ చేయడం మాత్రం వారి విజ్ఞతకే వదిలేయాలి. దర్గాలకు, చర్చిలకు ప్రభుత్వం నిధులిస్తే బీజేపీకి ఎందుకు కడుపు మంట.
పుష్కరాలు లాంటి సందర్భాల్లో తాత్కాలిక పనుల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసి.. మిగతా వర్గాలకు అలాంటి సంప్రదాయాలు లేవు కాబట్టి, వారికి నిధులెందుకివ్వాలనడం ఎక్కడి న్యాయం.
ప్రస్తుతం బీజేపీ వరస ఎలా ఉందంటే.. ఏపీలో అధికార పార్టీ నాయకులెవరూ ఆలయాలకు మినహా దర్గాలు, చర్చిలకు వెళ్లకూడదట. దేవాదాయ శాఖ మంత్రి ఇతర ప్రార్థనా స్థలాలకు వెళ్తే మలినమైపోతారట. అందుకే ఆయన దిష్టిబొమ్మల్ని కాల్చేస్తారట.
ఆలయాల ఆస్తుల్ని గత టీడీపీ ప్రభుత్వం కారు చౌకగా తమ పార్టీ నేతలకు కట్టబెడితే.. కళ్లప్పగించి చూసిన బీజేపీ నేతలు, అధికారంలో భాగస్వాములై ఉండి కూడా, దేవాదాయ శాఖ చేతిలో ఉండి కూడా, అక్రమాలకు వత్తాసు పలికిన కాషాయ కబోదులు.. ఇప్పుడెందుకో వైసీపీపై ఒంటికాలిపై లేస్తున్నారు.
హిందూత్వ అజెండాతో మరీ మూర్ఖంగా వెళ్తున్న ఏపీ బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మతతత్వ పార్టీ అనే ముద్ర నుంచి బైటపడాలనుకోకుండా.. అదే ముద్రను మరింత బలపరచుకోవాలనుకోవడం ఆ పార్టీ స్వయంకృతాపరాథం. దానికి తప్పదు తిరుపతిలో భారీ మూల్యం.