కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెట్టడం కాదు, ఆల్మోస్ట్ వణికిస్తోంది. ఈ కొత్త వేరియెంట్ కేసులు భారీ ఎత్తున బయటపడింది ఇంకా లేదు కానీ, ఇది ఎంత వినాశనం సృష్టిస్తుందో అనే ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతూ ఉంది. అమెరికాతో సహా యూరప్ దేశాలు ఇప్పటికే ఈ వేరియెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మొదలైంది.
మొన్నటి వరకూ కరోనా విషయంలో కూడా లిబరల్ గానే వ్యవహరించిన యూరోపియన్ దేశాలు ఈ సారి మాత్రం తాము తట్టుకోలేమన్నట్టుగా.. దక్షిఫ్రికా వైపు నుంచి ట్రావెల్ బ్యాన్ ను ప్రకటించాయి. సౌతాఫ్రికా వైపు నుంచి వచ్చే విమానాలను ఆల్మోస్ట్ నిషేధించాయి. అయితే తమ దేశ ప్రజలకు మాత్రం మినహాయింపు తప్పలేదు. అలా వచ్చే వారిని 14 రోజుల క్వారెంటైన్ లో ఉంచి తీరాలని, కొత్త వేరియెంట్ ను డిటెక్ట్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది.
ట్రావెల్ బ్యాన్ విషయంలో దక్షిణాఫ్రికా అభ్యంతరం చెబుతున్నా.. ఈయూ మాత్రం తాము రిస్క్ తీసుకోమని స్పష్టం చేసింది. ఇక ఈ ప్రమాదకరమైన కొత్త వేరియెంట్ ఓమీక్రాన్ మదుపరులను కూడా భయపెడుతోంది. దీంతో వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీనికి ఇండియా కూడా మినహాయింపు కాదు. ఇక కొత్త వేరియెంట్ పై వ్యాక్సినేషన్ ఎంత వరకూ పని చేస్తుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.
వ్యాక్సిన్ పని చేయదని కానీ, పని చేస్తుందని కానీ.. ఇప్పుడే డిసైడ్ చేసుకోలేరెవరూ. ప్రస్తుతానికి అయితే కరోనాను ఏ రూపంలో ఎదుర్కొనడంలో అయినా మనిషికి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే అని స్పష్టం అవుతోంది. వ్యాక్సిన్ రెండో డోసును వేయించుకోవడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న భారతీయులు కూడా ప్రస్తుత పరిణామాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.
రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోండంటూ కోట్ల మందిని ప్రభుత్వాలు ప్రాధేయపడుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం నిర్లక్ష్యపూరితంగానే వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి వేరియెంట్ల రూపంలో ప్రమాదం ఏదైనా ముంచుకు వస్తే.. అప్పుడు మళ్లీ ప్రభుత్వాలను నిందించి ఎంతవరకూ ప్రయోజనమో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడిప్పుడే కోవిడ్ పరిస్థితులు ఇండియాలో నిమ్మళిస్తున్నాయి.
మళ్లీ బండ్లు రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కొత్త ఆందోళన పరిస్థితిని అనిశ్చితిగా మారుస్తోంది. ఒక్కసారి పరిస్థితి ఆందోళన కరంగా, భయానకంగా మారింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సౌతాఫ్రికా వేదికగానే ఇది వరకూ కూడా కరోనా పలు కొత్త వేరియెంట్లు జనించేయనే వార్తలు గతంలోనూ వచ్చాయి. ఈ కొత్త వేరియెంట్ మాత్రం ప్రమాదకరం అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మరి దీనిపై మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది.