మండ‌లిలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ!

ఏపీ శాస‌న‌మండ‌లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ల‌భించింది. కొత్త‌గా ఎమ్మెల్సీల ఏక‌గ్రీవ ఎన్నిక‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం అధికారికంగా 31 సీట్ల‌కు చేరుకుంది. యాభై ఎనిమిది మంది స‌భ్యులున్న మండ‌లిలో…

ఏపీ శాస‌న‌మండ‌లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ల‌భించింది. కొత్త‌గా ఎమ్మెల్సీల ఏక‌గ్రీవ ఎన్నిక‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం అధికారికంగా 31 సీట్ల‌కు చేరుకుంది. యాభై ఎనిమిది మంది స‌భ్యులున్న మండ‌లిలో మొన్న‌టి వ‌ర‌కూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం 20 సీట్లు కాగా, ఇప్పుడు ఒక్క‌సారిగా ఆ బ‌లం 31కి చేరింది. దీంతో మండ‌లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సాకారం అయ్యింది. 

ఏపీ స్థానిక సంస్థ‌ల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఏక‌గ్రీవంగా ల‌భించాయి. స్థానిక సంస్థ‌ల కోటా విష‌యంలో ఏ జిల్లాలో కూడా టీడీపీ క‌నీసం పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవ‌డంతో.. ఆ పార్టీకి స్థానిక సంస్థ‌ల కోటాలో క‌నీసం నామినేష‌న్ వేయాల్సిన అవ‌స‌రం కూడా ప‌డ‌లేదు. 

ఇలా అన్ని స్థానాలూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతం అయ్యాయి. ఇటీవ‌లే ఏపీ శాస‌న‌స‌భ కోటాలో కూడా మూడు ఎమ్మెల్సీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ల‌భించాయి. దీంతో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఆ పార్టీకి 14 ఎమ్మెల్సీ స్థానాలు ద‌క్కిన‌ట్టుగా అయ్యింది. దీంతో ఆ పార్టీ మొత్తం బ‌లం 31 ఎమ్మెల్సీల‌కు పెరిగింది.

ఇక మిగిలిన సీట్ల‌లో కూడా ఖాళీ చేయ‌డ‌మే త‌ప్ప టీడీపీకి భ‌ర్తీ చేసే అవ‌కాశాలు ఏమీ లేవు. మండ‌లిలో ఆ పార్టీ త‌ర‌ఫు నుంచి ఒక్కో స‌భ్యుడూ ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకోవ‌డం, ఆ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ఎన్నిక కావ‌డ‌మే జ‌ర‌గ‌నుంది. 

రానున్న రెండున్న‌రేళ్ల‌లో కూడా టీడీపీ ఖాళీ చేసే సీట్ల‌న్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌క్క‌నున్నాయి. దీంతో మండ‌లిలో దాదాపు వంద శాతం సీట్ల‌లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులే కూర్చునే ప‌రిస్థితి రానుంది. వ‌చ్చే అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మండ‌లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం ఆ స్థాయికి చేర‌నుంది.