కరోనా వైరస్ రయ్‌మని దూసుకొస్తోంది. పేరుకు సూక్ష్మజీవే. కంటికి కనిపించదు. కానీ దాని కడుపు మాత్రం ప్రపంచమంత అనేలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రాణాలు బలి తీసుకున్నా దాని ఆకలి మాత్రం తీరలేదు. ఇంకా ఇంకా కావాలని, ఆకలితో ఆవురావుర మంటూ జనాలపై విరుచుకుపడుతోంది.
కరోనా వైరస్ ఆగడాలు మహాభారతంలో బకాసురుని గుర్తు తెస్తున్నాయి. ఏకచక్రపురం అనే గ్రామంలో బకాసురుడు ఉంటాడు. నరమాంసం తినే ఆ రాక్షసునితో రోజుకొక్కరు చొప్పున వంతుల వారీగా ఆహారంగా వస్తామని గ్రామస్తులు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే లక్కయింటి దహనం నుంచి తప్పించుకున్న పాండవులు ఎలాగో తప్పించుకుంటారు. పాండవులతో పాటు తల్లి కుంతి రహస్యంగా ఏకచక్రపురం గ్రామంలో తలదాచుకుంటూ ఉంటారు. పాండువులు తలదాచుకుంటున్న ఇంటి వంతు వచ్చే వరకు రాక్షసునితో గ్రామస్తులు చేసుకున్న ఒప్పందం గురించి కుంతీకి తెలియదు. అయితే ఆ రాక్షసునికి ఆహారంగా భీముడ్ని పంపడం, బకాసురుని తుదిముట్టించడం మహాభారతంలో ఆసక్తికరమైన ఘట్టం.
బకాసురుని మించిన రాక్షస లక్షణాలను కరోనా వైరస్ కలిగి ఉంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ కేవలం మనుషులకు మాత్రమే వ్యాపిస్తోంది. మనుషులను మాత్రమే బలి తీసుకుంటోంది. కరోనా కూడా నరమాంసం తప్ప మరేది భక్షించని రాక్షసి.
మన తెలుగు రాష్ట్రాల విషయానికి గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 111, తెలంగాణలో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 9 మంది మృత్యువాత కూడా పడ్డారు. ఏపీలో బుధవారం ఒక్కరోజే 67, తెలంగాణలో 30 కొత్త కేసులు బయటపడడం, అన్నీ ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
క్షణక్షణానికి తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, వాటికి ఢిల్లీ నిజాముద్దీన్‌తో సంబంధం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకున్నాయి. మరీ ముఖ్యంగా రెండు రోజుల క్రితం కడపలో ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆ జిల్లా ప్రజానీకానికి, ఒకే రోజు 15 కేసులు నమోదు కావడంతో కంటి మీద కునుకు కరువైంది. ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లు జిల్లా నలుమూలలా ఉన్నారని తేలడంతో మరెంత మందికి ఈ వైరస్ సోకి ఉంటుందోనని ఆందోళనలో ఉన్నారు.
మొత్తానికి రోజులు గడిచేకొద్దీ కరోనా వైరస్ తన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తోంది. ప్రజలపై పంజా విసురుతూ తన ఆకలి తీర్చుకునేందుకు అమానవీయంగా ప్రవర్తిస్తోంది. ఇంత వరకూ ఆ వైరస్‌కు మందులు లేకపోవడంతో మరింత రెచ్చిపోతోంది. ఇంకెంత కాలం జీవశ్చవల్లా బతకాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.