కేంద్రం అవమానకర ప్రకటన!

ప్రభుత్వం ద్వారా ఒక డిమాండ్ ను నెరవేర్చుకోవాలంటే.. వారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లితే పని జరుగుతుందని అనుకుంటాం. ఇది సాధారణ ప్రభుత్వాలు చేసే పని. కానీ… వీరి మీద నిందలు వేస్తే, రాయి…

ప్రభుత్వం ద్వారా ఒక డిమాండ్ ను నెరవేర్చుకోవాలంటే.. వారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లితే పని జరుగుతుందని అనుకుంటాం. ఇది సాధారణ ప్రభుత్వాలు చేసే పని. కానీ… వీరి మీద నిందలు వేస్తే, రాయి విసిరితే.. ఎవరు రాయి విసిరారో వారికి మాత్రమే పనిచేసిపెట్టడాన్ని ఏమనుకోవాలి. పసలేని ప్రభుత్వాల చేతగాని వైఖరి అనుకోవాలి. ఇప్పుడు మోదీ సర్కారులోని సచివులు మాట్లాడుతున్న విషయాలను గమనించినప్పుడు అలాగే అనిపిస్తోంది.

ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ చిన్న పిల్లలకు త్రిభాషా సిద్ధాంతం పేరిట ఒక అగ్గిని రాజేశారు. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల పిల్లలందరకూ విధిగా హిందీ నేర్పాలని ఆయన ప్రతిపాదించడంతో… దానిపట్ల తమిళ, మళయాళ, కన్నడ ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. తమిళులు ఆదినుంచి కూడా హిందీ భాషను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తమిళులకు స్వభాషాభిమానం చాలా ఎక్కువ. పైపెచ్చు హిందీని వ్యతిరేకించడం అనేది వారి మౌలికమౌన ద్రవిడ ఉద్యమాలకు కారణమైంది.

స్వాతంత్ర్యపోరాటం కాలం నుంచి హిందీ భాష మాట్లాడేవారి పెత్తందారీ, ఆధిపత్య పోకడల కింద తమ స్వాభిమానం నలిగిపోతున్నదనే వారు ఆ భాషను వ్యతిరేకిస్తూ ద్రవిడ పార్టీలుగా పుట్టుకొచ్చారు. ఇప్పుడు కేంద్రం హిందీని రుద్దాలని చేస్తున్న ఆలోచనను తెలుగు వారు తప్ప.. అన్ని దక్షిణాది ప్రాంతాల నాయకులు ఖండించారు.

అయితే కేంద్రం సిగ్గులేని తనం ఏంటంటే… కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ తమిళుల ఆగ్రహాన్ని మాత్రమే చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తమిళ మూలాలు కలిగిఉన్నది అయితే కావొచ్చు గాక… కానీ, ప్రస్తుతం ఒక జాతీయ ప్రభుత్వానికి ప్రతినిధిగా మాట్లాడుతున్నానని గుర్తుంచుకోవాలి. అందరూ నిరసనలు వ్యక్తంచేస్తుండగా.. కేంద్రం తమిళానికి తగిన ప్రాధాన్యం తప్పక ఇస్తుందని ఆమె సెలవిస్తున్నారు. మిగిలిన దక్షిణాది భాషల వారికి ఇది మరింత అవమానకరమైన ప్రకటన.

జాతీయ భాష హిందీ గనుక… దానిని అందరూ నేర్చుకోవాలనడం తప్పు కాదు. నేర్చుకు తీరాల్సిందే అంటే మాత్రం అది ప్రజాస్వామ్యం కాదు. ఆ భాషను దక్షిణాదిలో ఆప్షనల్ గా ఇవ్వాలి. అలాగే అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దక్షిణాది భాషలన్నిటినీ కూడా ఆప్షనల్ గా ఉంచాలి. తమిళమా? తెలుగా? ఏదో ఒకటి ఆ ప్రాంతాల వారు కూడా నేర్చుకోవాలి. అలా చేసినప్పుడే అది వివక్ష చూపని జాతీయ ప్రభుత్వం అవుతుంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు