తప్పు చేయలేదట.. సాకులు వెతుకుతున్నారు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు పార్టీ పరాజయానికి సాకులు వెతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత తొలిసారి బహిరంగ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో మాదిరి ఆయన గంటలు, గంటలు మాట్లాడకపోవడం…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు పార్టీ పరాజయానికి సాకులు వెతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత తొలిసారి బహిరంగ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో మాదిరి ఆయన గంటలు, గంటలు మాట్లాడకపోవడం ఒక పరిణామం. దీనిని ఆయన కొనసాగిస్తారో లేదో కాని, చంద్రబాబు రొటీన్‌ ప్రసంగాలు విని, విని విసుగెత్తిన టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఇది మాత్రం మంచి రిలీఫ్‌ అని చెప్పాలి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన సభలో మాట్లాడారు. ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగిందే. ఎన్‌టీఆర్‌ అంతటివాడికే అపజయం తప్పలేదని, ఆయినా ఆయన ప్రజలలో ఉన్నారని అన్నారు. టీడీపీకి తిరిగి వైభవం తేవడానికి ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు.

ఎన్‌టీఆర్‌ 1989లో అధికారాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ఆయన కల్వకుర్తి నుంచి కూడా పోటీచేసి ఓటమి చెందడం అప్పట్లో పెద్ద సంచలనం. కాని తదుపరి 1994లో టీడీపీని మరింత ప్రభంజనం వైపు నడిపించిన చరిత్ర ఎన్‌టీఆర్‌ది. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా చంద్రబాబు చేతిలోనే పరాభవానికి గురికావడం చారిత్రక విషాదం. తదుపరి ఆయన మనోవేదనతో కాలం చేశారన్నది చారిత్రక సత్యం. నిజానికి 1989లో జరిగిన ఓటమిలో కూడా చంద్రబాబుకు భాగస్వామ్యం ఉంది. అప్పట్లో ఈయన కర్షక పరిషత్‌ చైర్మన్‌గా వివాదాస్పద అయి తన మామ ఎన్‌టీఆర్‌కు చికాకు తెచ్చారు. తిరిగి 1994లో ఎన్‌టీఆర్‌ పదవినే కైవసం చేసుకున్నారు. అయినా ఎన్‌టీఆర్‌ స్పూర్తి అని చంద్రబాబు ప్రసంగాలు చేయగలుగుతున్నారు.

ఎన్‌టీఆర్‌ స్పూర్తి అంటే కాంగ్రెస్‌తో జతకట్టడమా అంటే దానికి సమాధానం దొరకదు. ఎన్‌టీఆర్‌ స్పూర్తి అంటే ఎదుటిపక్షం ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనుగోలు చేయడమా? అంటే జవాబు దొరకదు. ఇలా ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. మనమేం తప్ప చేయలేదు. రాష్ట్రం కోసం కష్టపడి పనిచేశాం అని తనను కలిసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు చెబుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఒకరకంగా ఇది ఆత్మవంచన అవుతుంది. తనతో సహా అందరం తప్పులు చేసి ఉంటాం.. అందుకే ఓడిపోయి ఉంటాం అని చెప్పి ఉంటే టీడీపీ కార్యకర్తలు నేతలలో ఒక నమ్మకం ఏర్పడేది. ఇప్పుడైనా చంద్రబాబు నిజాలు చెబుతున్నారని అనుకునేవారు. ప్రతిరోజూ గంటలకొద్ది టీవీలలో కనిపిస్తే పనిచేసినట్లు అని చంద్రబాబు అనుకునేవారు.

నిజానికి తానుపని చేస్తుంటే టీవీలలో అనండి.. మీడియా అనండి ఆటోమాటిక్‌గా కనిపిస్తారన్న సంగతిని విస్మరించి, ఎప్పుడూ గంటల కొద్ది తన ప్రసంగాలతో జనాన్ని ఊదరగొట్టే విసిగించేవారు. ఆ సంగతులను ఆయన మర్చిపోయి ఉండవచ్చు. గత ఐదేళ్లకాలంలో ఆయన గంటలకు తక్కువ కాకుండా చేసిన ప్రసంగాలు బహుశా అరుదుగా ఉంటాయని చెప్పవచ్చు. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు పది నిమిషాలలోపే ప్రసంగం ముగంచారు? నిజానికి చంద్రబాబు ఈ సభలో ఏవైనా కీలక వ్యాఖ్యలు చేస్తారేమోనని అంతా ఎదురుచూశారు. అయితే ఎన్‌టీఆర్‌ అంతటివాడే ఓడిపోయాడు అని కార్యకర్తలు, నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసి ప్రసంగం ముగించారనుకోవాలి. అయితే అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి కొంత ప్రయత్నించారు.

కాని కొందరు కార్యకర్తలు, కొంతమంది నేతలు మాత్రం ఈవీఎమ్‌ల మోసమని, కొందరు నేతల మోసమని విశ్లేషించే యత్నంచేశారు. తద్వారా చంద్రబాబు, లోకేష్‌ల తప్పు ఏమీలేదని ప్రచారం చేయడానికి టీడీపీ సన్నద్ధం అవుతోందని అర్థం అవుతుంది. విజయం సాధిస్తే అదంతా చంద్రబాబు క్రెడిట్‌లో వేస్తే, ఓటమి మాత్రం వేరే వారి ఖాతాలలో వేస్తారా అని ప్రశ్నించేవారూ లేకపోలేదు. కాకపోతే వారు ప్రస్తుతానికి మౌనం దాల్చారనుకోవాలి. నాయకులు ఓటమిపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి కుమారుడు అయిన లోకేష్‌ కూడా ఓడిపోవడం దేనికి సంకేతం అవుతుంది.

ఎవరు ఎవరిని మసం చేశారు. పార్టీలో ఒకరినొకరు మోసం చేసుకున్నారా? లేక అంతాకలిసి ప్రజలను మోసం చేశారా? చంద్రబాబు అన్నట్లు ఆయన కాని, టీడీపీ నేతలు కాని తప్పు చేయకపోతే, మరి ఎవరు తప్పు చేసినట్లు? అంటే తమకు ఓట్లు వేయకపోవడం జనం తప్పు అని టీడీపీ నేతలు  చెప్పదలిచారా? ఏది ఏమైనా టీడీపీలో కొంతకాలం గందరగోళం ఉంటుంది. అవి ఏ రూపం దాల్చుతాయన్నది అప్పుడే చెప్పలేం.

టీడీపీకి ఒకరకంగా ఇది సంక్షోభ సమయం. మరోవైపు ఎన్‌టీఆర్‌ ఆత్మ ఇప్పుడు శాంతించిందని, లక్ష్మీపార్వతి, మోత్కుపల్లి నరసింహులు వంటివారు అంటున్నారు. ఎన్‌టీఆర్‌ కూడా ఓటమి చెందారని టీడీపీ అధినేత చంద్రబాబు సరిపెట్టుకుంటే, ఎన్‌టీఆర్‌ ఇప్పుడు సంతోషిస్తున్నారని వీళ్లు భావిస్తున్నారు. మొత్తంమీద టీడీపీ ఓటమితో ఎన్‌టీఆర్‌ అవసరం పార్టీ అధినేతకు బాగా గుర్తుకు వచ్చిందని అనుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?