తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నది సామెత. మోడీ లాంటి బలమైన మిత్రుడిని శతృవును చేసుకునే వరకు, చేసే వరకు నిద్రపోలేదు, బాబుగారి, ఆయన పార్టీ హితవు కోరే ఓ మీడియా. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిని చేసిన దగ్గర నుంచి రకరకాలుగా వార్తలు, కథనాలు వండి వార్చి బాబుకు-మోడీకి మధ్య ఎడం ఎంత పెంచాలో అంతా పెంచేసారు. అదే సమయంలో మోడీకి వ్యతిరేకంగా కథనాలు వండి వార్చారు. ఆంధ్ర జనాల్లో మోడీని భయంకరమైన భూతం మాదిరి చూపించి, తద్వారా తేదేపాకు ఓట్లు రాబట్టాలని చూసారు.
కానీ ఇదంతా వికటించింది. మోడీ అభిమానులు తెలుగుదేశానికి పూర్తిగా దూరం అయ్యారు. కేవలం మూడు ఎంపీ సీట్లు, అది కూడా అతి కష్టం మీద రావడానికి కారణం అదే. సరే, ఆంధ్ర సంగతి అలావుంచితే తెలంగాణలో మాత్రం కేసిఆర్ పదిలంగా ఎందుకు వుండాలి? కేసిఆర్ ను కూడా మోడీకి దూరం చేద్దాం అనే ప్రణాళికలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పడిప్పుడే అంతంతమాత్రంగా వున్నాయి మోడీ-కేసిఆర్ బంధం. కానీ మోడీ బలం చూసిన తరువాత కేసిఆర్ దూరం జరిగే ధైర్యం చేయరు. మరి అలాంటపుడు ఏం చేయాలి. దూరం జరిగేలా చేయాలి. తెలంగాణలో భాజపా అర్జెంట్ గా ఏదో చేసేయబోతోందని, ఏదో చేసేస్తుందని కథనాలు వండి వారిస్తే, కేసిఆర్ తన అస్తిత్వం కూడా పోరాటం మొదలుపెట్టేస్తారు. దాంతో మోడీ దూరం అయిపోతారు.
అప్పుడు గతంలో ఇదే మీడియా ఆశించిన తెలుగుదేశం-తెరాస పొత్తు సాధ్యమైతే తెలంగాణలో మళ్లీ తాము పాగా వేసేయవచ్చు. అసలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి కీలకమద్దతు దారులైన కమ్మ సామాజిక వర్గం పప్పులు ఉడకడంలేదు. పైగా ఆంధ్రలో కూడా పగోడు వచ్చి పగ్గాలు చేతపట్టాడు. అందువల్ల మెలమెల్లగా కథనాలు రాసి, రాసి, పలుకులు పలికి పలికి, కేసిఆర్ ను కూడా మోడీకి దూరంగా లాగేస్తే, ఓ పనైపోతుంది అనే ఆలోచన కనిపిస్తోంది.
ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఇచ్చే బాబుకు, ఆయన పార్టీకి ఈ పరిస్థితి వచ్చేలా చేసారు. ఈ మాటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బాబుకు ఆ మీడియా శల్య సారథ్యం చేసి, కింద పడేసిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పడు కేసిఆర్ దగ్గర వచ్చారు. ఆయన ఈ మీడియా మాటలు పట్టించుకుంటారో? దూరం పెడతారో? చూడాలి.