రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేనాని పవన్ కల్యాణ్ టూర్ ఖరారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, అది కూడా కేవలం పవన్ కల్యాణ్ పై సింపతీ పెరగడం కోసమే జరుగుతాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే రాజధాని విషయంలో అధికారపక్షంపై మాటల తూటాలు పేల్చారు జనసేనాని. రాజధానిని తరలిస్తే చూస్తూ ఊరుకోబోనని సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో అమరావతిలో పవన్ కల్యాణ్ పర్యటనలో అలజడులు చెలరేగే అవకాశముందని సమాచారం. అయితే ఇవి ప్రీ-ప్లాన్డ్ గా జరిగే సంఘటనలుగా కొన్ని వర్గాలు అభివర్ణిస్తున్నాయి. కేవలం సింపతీ కోసమే పవన్ పర్యటనల్లో అలజడులు రేకెత్తించేందుకు ఓ బ్యాచ్ రెడీ అవుతోందట.
ఈ పుకార్లలో ఎంత నిజం ఉందో చెప్పలేం కానీ.. జనసేన శతఘ్ని పెడుతున్న ట్వీట్లను చూస్తుంటే.. వైసీపీ వాళ్లను జనసైనికులు కావాలనే రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తోంది. “జనసేనను ఇష్టమొచ్చినట్లు తిడతాం, జనసైనికులు తిరిగి ఏమైనా విమర్శిస్తే వారి కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తాం అనే ధోరణిలో అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించడం సరికాదు.. దయచేసి మీ నాయకులు కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోవాల్సిందిగా వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం” అంటూ పవన్ ఫొటోను పెట్టి శతఘ్ని అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. టూర్ ఖరారైన తర్వాత ఈ ట్వీట్ బైటకు వదలడం విశేషం.
పార్టీ అనుబంధ విభాగం అయిన శతఘ్ని ద్వారా ఇప్పటికే వైసీపీ నేతల్ని రెచ్చగొట్టే కార్యక్రమం జరుగుతోంది. తాజాగా మరింత ఎక్కువగా మాటలతో, చేతలతో వైసీపీపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు జనసైనికులు. ఈ నేపథ్యంలో జనసేన సింపతీ కోసం ఎంతకైనా దిగజారే అవకాశం కనిపిస్తోంది. పవన్ టూర్ లో గొడవ జరిగితే దాన్ని రాజధాని పరిరక్షణపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించడం జనసేన ఆలోచన. అందుకే రాజధాని పరిశీలిస్తానంటూ బయలుదేరారు జనసేనాని. ఆయన పర్యటనలో పొలాలు, ఇళ్లు, సచివాలయం, హైకోర్టు భవనాలు, ఉద్యోగుల నివాసాలు.. ఇలా అన్నీ ఉన్నాయి.
ఇవన్నీ తిరిగి పవన్ కల్యాణ్ ఎలాంటి జ్ఞానాన్ని సముపార్జిస్తారో.. నాలుగేళ్లు చంద్రబాబుని పల్లెత్తుమాట అనని పవన్, జగన్ పై ఎందుకంత ఉధృతంగా మాటల దాడి చేస్తున్నారో ఆయనకే తెలియాలి. నిజంగానే పవన్ పర్యటనలో గొడవలు జరిగి, అవి జనసైనికుల వ్యూహంలో భాగమేనని తేలితే.. అంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉండదేమో..!