ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?

పొలిటికల్‌ ఆరంగేట్రం చేస్తూ.. చేస్తూ.. తెలుగుదేశం పార్టీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్న ఎన్నికల్లో వీరంతా రంగంలోకి దిగారు. వీరికి ఎదురుదెబ్బ తప్పదని మొదటి నుంచి విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. అయితే వారు…

పొలిటికల్‌ ఆరంగేట్రం చేస్తూ.. చేస్తూ.. తెలుగుదేశం పార్టీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్న ఎన్నికల్లో వీరంతా రంగంలోకి దిగారు. వీరికి ఎదురుదెబ్బ తప్పదని మొదటి నుంచి విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. అయితే వారు మాత్రం తాము గెలుస్తామంటూ, గెలవడం ఖాయమంటూ హడావుడి చేశారు. తీరా ప్రజలు మాత్రం వారికి గట్టి ఝలక్‌ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సదరు రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో గట్టి ఝలక్‌ ఎవరికైనా తగిలిందంటే అది జేసీ సోదరులకే అని చెప్పాలి. అనంతపురం నుంచి జేసీ దివాకర్‌ రెడ్డి తనయుడు పవన్‌రెడ్డి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అంతకు మించిన సంచలనం తాడిపత్రిలో చోటు చేసుకుంది. అక్కడ నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి పోటీచేసి చిత్తు అయ్యారు. అనంతపురం ఎంపీ సీట్లో అయినా జేసీ పవన్‌ ఓడిపోతాడని ఎవరైనా అంచనా వేశారేమో కానీ, తాడిపత్రిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆ రేంజల్లో ఎగురుతుందని చాలా తక్కువమంది అనుకుని ఉండవచ్చు. ఎవరు గెలిచినా, వెయ్యి-రెండువేల స్థాయి మెజారిటీ మాత్రమే ఉంటుందని పరిశీలకులు చెబుతూ వచ్చారు.

తాడిపత్రి దశాబ్దాలుగా జేసీ సోదరులకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. అక్కడ నుంచి ఆరంగేట్రంలో దివాకర్‌ రెడ్డి ఓడిపోయారు. తొలిసారి పోటీచేసినప్పుడు ఇండిపెండెంట్‌గా  పోటీచేసి దివాకర్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ దక్కాకా వరస విజయాలను నమోదు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గాలి ఏపీ అంతా గట్టిగా వీచిన సందర్భాల్లో కూడా దివాకర్‌ రెడ్డి విజయం సాధ్యం అయ్యింది. దివాకర్‌ రెడ్డిని ఓడించడానికి కొన్నిసార్లు పరిటాల రవి తాడిపత్రిలో హల్చల్‌ చేశారు. అయినా దివాకర్‌ రెడ్డి విజయం మాత్రం సాధ్యం అయ్యింది.

గతంలో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి దివాకర్‌ రెడ్డిని గడగడలాడించారు. అయితే విజయం మాత్రం జేసీకే దక్కింది. అయితే ఇప్పుడు అదే సూర్యప్రతాపరెడ్డి తమ్ముడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఘన విజయం సాధించారు. జగన్‌ గాలిలో దివాకర్‌ రెడ్డి కంచుకోట కూడా కూలిగింది. దివాకర్‌ రెడ్డి తమ్ముడి కొడుకుకు ఆరంగేట్రంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఒకవేళ ఈ ఎన్నికల్లో జేసీ దివాకర్‌ రెడ్డి ఎంపీగా, ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయి ఉంటే.. వారి తనయులకు భవిష్యత్‌ అవకాశాలు ఉండేవేమో! అయితే ఇప్పుడు జేసీ జూనియర్లే పోటీచేసి ఓటమి పాలయ్యారు. వారి తండ్రుల రాజకీయ నేఫథ్యాన్ని బట్టి చూస్తే వీరు ఓడిపోవడం చాలా బ్యాడ్‌ స్టార్టింగ్‌. కెరీర్‌కే ఇబ్బందికరమైన అంశం. ఇదంతా జేసీ సోదరులు చేజేతులారా చేసుకున్నదే.

జగన్‌ మీద అనుచితంగా మాట్లాడుతూ వచ్చారు. చాలా దిగువస్థాయి మాటలు మాట్లాడారు. ఆ మాటలు అంతవరకూ జేసీలకు అండగా నిలుస్తూ వచ్చిన 'రెడ్డి' కులస్తులకే కోపం తెప్పించాయి. అంతవరకూ వీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినా ఓటేసిన వాళ్లు, వీరి ఓవరాక్షన్‌ చూశాకా మాత్రం చిత్తుగా ఓడించి పక్కనపెట్టారు! తమ రాజకీయ భవితవ్యం కోసం జేసీ జూనియర్లు తెలుగుదేశం పార్టీలోనే మిగిలిపోతారో లేక ఎలాగోలా జగన్‌ పంచన స్థానం సంపాదిస్తారో!

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?