జగన్‌ కేబినెట్లో సీమ మంత్రులు ఎవరెవరు?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన నేపథ్యంలో ఇక మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. జగన్‌ కేబినెట్లో బెర్తుల గురించి దాదాపు నెలపై…

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన నేపథ్యంలో ఇక మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. జగన్‌ కేబినెట్లో బెర్తుల గురించి దాదాపు నెలపై నుంచినే చర్చ ఉంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం సొంతం చేసుకోవడం ఖాయమనే అంచనాలు ఏర్పడటంతో జగన్‌ కేబినెట్లో ఎవరెవరికి ఛాన్స్‌ దక్కుతుందనేది ఆసక్తిదాయకమైన చర్చగా మారింది.

జగన్‌ కేబినెట్లో బెర్తుల కోసం అప్పుడే నేతలు లాబీయింగ్‌లు కూడా మొదలుపెట్టారు. జగన్‌ను కలిసి వారు తమ ఆశలను చెప్పుకున్నారు. అప్పుడు జగన్‌ వారికి ఒకే సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఫలితాలు వచ్చాకా మాట్లాడుకుందాం..' అని జగన్‌ సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. ఫలితాలు రానే వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు వైఎస్‌ జగన్‌కు ప్రజలు ప్రభంజనం లాంటి విక్టరీని ఇచ్చారు. దీంతో మంత్రి పదవుల కోసం పోటీ మరింత పెరిగింది.

ఎక్కువమంది ఎమ్మెల్యేలు నెగ్గేయడంతో వారిలో ఎవరికి జగన్‌ మంత్రి పదవులను ఇస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. పోటీ ఎక్కువ అయ్యింది. ఈ పరిణామాల్లో మంత్రి పదవుల విషయంలో జగన్‌ ఒకింత స్పష్టతతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరికి ఏ పదవులను ఇవ్వాలనే అంశం గురించి జగన్‌ సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేశారనే మాట వినిపిస్తోంది. పార్టీ నేతల వద్ద జగన్‌ మోహన్‌రెడ్డి ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారట. ఆశావహుల వద్దనే జగన్‌ ఈ విషయాలను ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మంత్రి పదవులను కేటాయించడం విషయంలో జగన్‌ మోహన్‌రెడ్డి ఒక్కో ఎంపీ  సీటు పరిధిలోని వారికి ఒక్కొటి అనే లెక్కలతో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి కాకపోయినా ఓవరాల్‌గా ఒక్కో ఎంపీ సీటు పరిధిలో ఒక్కో ఎమ్మెల్యేకు మంత్రి పదవిని కేటాయించే ఉద్దేశంతో ఉన్నారట జగన్‌ మోహన్‌రెడ్డి. అందులో భాగంగా ఇప్పటికే ఎంపిక కూడా పూర్తి అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అనంతపురం టౌన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణలకు అనంతపురం జిల్లా కోటాలో మంత్రి పదవులు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతూ ఉంది.

ఇక కడపజిల్లాలో జగన్‌ మోహన్‌ రెడ్డి కడప ఎమ్మెల్యేకు, రాజంపేట ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నారట. ఒక మైనారిటీ కోటాను అలా భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో మాత్రం ఆశావహుల సంఖ్య గట్టిగా ఉంది. శిల్పా కుటుంబం ఒక మంత్రి పదవిని ఆశిస్తోంది. మంత్రిపదవి కోసం గట్టి పట్టుపడుతున్న వారిలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా ఉన్నారు.

బాలనాగిరెడ్డితో పాటు ఆయన సోదరులు ఇద్దరు ఈసారి ఎమ్మెల్యేలుగా నెగ్గారు. అనంతపురం జిల్లా గుంతకల్‌ నుంచి నెగ్గిన వెంకట్రామిరెడ్డి, ఆదోనీ నుంచి సాయిప్రసాద్‌ రెడ్డిలు బాలనాగిరెడ్డికి సోదరులు. వీరి మరో సోదరుడు శివరామిరెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే సీటును ఆశించారు. అయితే అది ఆయనకు దక్కలేదు. ఈ క్రమంలో బాలనాగిరెడ్డి తనకు మంత్రిపదవి కావాలని పట్టు పడుతున్నట్టుగా తెలుస్తోంది.

అలాగే కర్నూలు జిల్లాకే చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి మంత్రిపదవి దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలున్నాయి. ఇంకా మరింత మంది ఆశావహులున్నారక్కడ. మరి కర్నూలులో జగన్‌ మోహన్‌రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిదాయకమైన అంశంగా మిగిలింది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం బెర్త్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. ఇక తిరుపతి నుంచి నెగ్గిన భూమన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారని భోగట్టా. అయితే ఆయన టీటీడీ చైర్మన్‌గా వెళ్లవచ్చు అనే అభిప్రాయాలున్నాయి.

ఇక చిత్తూరు జిల్లా నుంచినే మరో అశావహ ఎమ్మెల్యే ఆర్కే రోజా. తనకు మంత్రిపదవి ఖాయమనే అంచనాలతో ఉన్నారామె. అయితే ఆమెను జగన్‌ స్పీకర్‌గా కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఉన్నారట. దానికి రోజా నో అంటోందని.. తనకు మంత్రిపదవే కావాలని ఆమె పట్టుపడుతూ ఉన్నారని టాక్‌.

స్థూలంగా రాయలసీమ నుంచి పది మందికి పైనే ఆశావహులు కనిపిస్తున్నారు. అయితే జగన్‌ ఎన్ని మంత్రి పదవులను భర్తీ చేస్తారో ఇంకా స్పష్టతలేదు. పదహైదు మంది చేత ప్రమాణ స్వీకారం చేయించవచ్చు అనే టాక్‌ కూడా ఉంది. అదే జరిగితే సీమ నుంచి ఆశావహుల్లో సగం మందికి భంగపాటు తప్పకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?