పక్కదారి చూసుకోకుంటే పక్కాగా మునుగుతాం

తెలంగాణ తెలుగుదేశంలో అంతర్మథనం మొదలైంది. ఆ రాష్ట్రంలో పార్టీ సర్వభ్రష్టత్వం చెంది, నాశనం అయిపోయినా సరే కనీసం పొరుగు రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్నది కాబట్టి ఏదో దందాలు చేసుకుంటూ మనుగడ సాగించవచ్చునని ఆశపడిన…

తెలంగాణ తెలుగుదేశంలో అంతర్మథనం మొదలైంది. ఆ రాష్ట్రంలో పార్టీ సర్వభ్రష్టత్వం చెంది, నాశనం అయిపోయినా సరే కనీసం పొరుగు రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్నది కాబట్టి ఏదో దందాలు చేసుకుంటూ మనుగడ సాగించవచ్చునని ఆశపడిన వాళ్లు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రెండు రాష్ట్రాల్లోనూ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలను, పక్క దారులను వెతుక్కునే పనిలో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో తెలుగు దేశానికి అత్యంత విశ్వసనీయులైన వారు కూడా ఇప్పుడు తెరాస వైపు చూస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

తెలంగాణలో తెలుగుదేశం పతనం అనేది చాలాకాలం కిందటే సూచనమాత్రంగా కనిపించింది. పార్టీతో ఎంత అనుబంధం ఉన్నప్పటికీ, తెలివైన నాయకులు కొందరు ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. కొందరు తెరాసను, అక్కడ మొగం చెల్లనివారు కాంగ్రెస్ ను ఎంచుకున్నారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినప్పటికీ పార్టీకి విశ్వాసపాత్రులుగా ముద్ర ఉన్న కొందరు నాయకులు మాత్రం తెదేపాలోనే మిగిలారు. అయితే ఇక్కడ విశ్వాసం కంటే పొరుగు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం అనేది వీరిని నిలిపి ఉంచిందని చెప్పాలి.

అక్కడ అధికారం ద్వారా లబ్ధి పొందడం వీరి టార్గెట్ గా ఉండిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీకి అక్కడ అధికారము లేదు… ఇక్కడ భవిష్యత్తు లేదు! ఇంకా పార్టీలోనే మిగిలి ఉండటం మూర్ఖత్వం అవుతుంది అని నాయకులకు అర్థమైంది!! దాంతో నెమ్మదిగా పక్కదారులు చూసుకుంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన నామా నాగేశ్వరరావు తెరాసలో చేరి ఎంపీగా గెలవడంతోనే ఇది మొదలైంది.

ఇప్పుడు ఏపీలో ఓడిపోయిన తర్వాత మిగిలినవారు కూడా మేలుకుంటున్నారు. రమణ, రావుల, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తప్ప ఇక్కడ మిగిలిన పెద్ద నాయకులు లేరు. కార్యకర్తల సంగతి సరేసరి. మొత్తానికి తెలంగాణ తెలుగుదేశం మరి కొన్నాళ్లలో పూర్తిగా కనుమరుగు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?