కోడెల చేతివాటం.. ల్యాప్ టాప్ లు కూడా!

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబీకుల చేతివాటం ఫలితంగా మాయమైన ల్యాప్ టాప్ లు తిరిగి డీఆర్డీఏ కార్యాలయాన్ని చేరినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అంటూ ప్రభుత్వం కేటాయించిన ముప్పై…

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబీకుల చేతివాటం ఫలితంగా మాయమైన ల్యాప్ టాప్ లు తిరిగి డీఆర్డీఏ కార్యాలయాన్ని చేరినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అంటూ ప్రభుత్వం కేటాయించిన ముప్పై ల్యాప్ టాప్ లను కోడెల కుటుంబీకులు తమ ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చిన ఆ ల్యాప్ టాప్ లను కోడెల శివరాం అవసరాల మేరకు తరలించారట.

చంద్రబాబు నాయుడు హయాంలో నిరుద్యోగులకు అంటూ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటి కోసం అంటూ ఇలాంటి కేటాయింపులు చేశారు. అయితే ఆ టీచింగ్ స్టాఫ్ కు సరిగా జీతాలు ఇచ్చింది కూడా లేదు. నెలల తరబడి వారి చేత పని చేయించుకుని, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లతో అద్భుతాలు జరుగుతున్నాయని డబ్బా కొట్టుకున్నారు.

ఇక అలాంటి సెంటర్లలో సత్తెనపల్లి కేంద్రానికి వచ్చిన ల్యాప్ టాప్ లపై కోడెల కన్నుపడింది. అసెంబ్లీలో ఫర్నీచర్ నే తరలించుకు వెళ్లిన వారికి ఆ కంప్యూటర్లు ఎంతసేపు! వచ్చిన వాటిని తీసుకెళ్లారట. అధికారం తమ చేజారి మూడునెలలు అయినా వాటి గురించి కోడెల కుటుంబీకులు పట్టించుకున్నట్టుగా లేరు. తమను ఎవరూ ఏం చేయలేరనే లెక్కలతో ఉన్నట్టున్నారు.

అయితే అసెంబ్లీలో ఫర్నీచర్ దొంగతనానికి సంబంధించి కేసులు నమోదు కాగానే కోడెల కుటుంబానికి ల్యాప్ టాప్ లు కూడా గుర్తుకువచ్చాయి. వెంటనే వాటిని గుంటూరు డీఆర్డీఏ ఆఫీసుకు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే సెలవుదినం కావడంతో ఆఫీసు మూసి ఉండటంతో వాటిని అక్కడే తెరిచి ఉంచిన రూమ్ లో పెట్టేసి వచ్చారట! ఎక్కడ కేసులు నమోదవుతాయనే భయంతో అజేష్ చౌదరి అనే వ్యక్తి సాయంతో వాటిని అక్కడకు చేర్చారట.

అయితే ఇప్పటికే మాయమైన ల్యాప్ టాప్ ల విషయంలో డీఆర్డీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఖరికి నిరుద్యోగుల కోసమంటూ వచ్చిన ల్యాప్ టాప్ లనుకూడా తమ అవసరానికి వాడుకోవడానికి తీసుకెళ్లిన స్థాయిలో వారి దోపిడీ జరిగిందంటే.. నాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!