ధోనీని సమం చేసిన కొహ్లీ.. రికార్డు దిశగా!

టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా సాగుతూ ఉన్నాడు విరాట్ కొహ్లీ. సిసలైన క్రికెట్ గా భావించే టెస్టు క్రికెట్ లో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ కీర్తికిరీటంలో మరో కళికితురాయి చేరుతూ ఉంది.…

టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా సాగుతూ ఉన్నాడు విరాట్ కొహ్లీ. సిసలైన క్రికెట్ గా భావించే టెస్టు క్రికెట్ లో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ కీర్తికిరీటంలో మరో కళికితురాయి చేరుతూ ఉంది. టెస్టుల్లో టీమిండియాకు అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్ గా నిలిచే దిశగా సాగుతున్నాడు కొహ్లీ.

వెస్టిండీస్ పై తొలిటెస్టులో సాధించిన భారీ విజయంతో ఇది వరకూ ధోనీ పేరు మీద ఉన్న రికార్డును సమం చేశాడు కొహ్లీ. ఈ విజయంతో కొహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో సాధించిన విజయాల సంఖ్య 27కు చేరింది. ఇదివరకూ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా సరిగ్గే ఇన్నే విజయాలను సాధించింది. మరో మ్యాచ్ లో టీమిండియా నెగ్గితే అత్యధిక విజయాల కెప్టెన్ గా కొహ్లీ నిలవబోతున్నాడు.

మొత్తం 47 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు కొహ్లీ. వాటిల్లో 27 మ్యాచ్ లలో విజయాలున్నాయి. 10 మ్యాచ్ లలో టీమిండియా ఓడిపోగా, మరో 10 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. కొహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో టెస్టు సీరిస్ నెగ్గడం చారిత్రాత్మక విజయం. అయితే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లలో మాత్రం ఆ జట్లపై టీమిండియా నెగ్గుకురాలేకపోయింది.

27 మ్యాచ్ లలో విజయాలు సాధించేందుకు ధోనీ కెప్టెన్సీలో 60 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. ధోనీ 60 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించగా, అందులో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలున్నాయి. టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా అజారుద్ధీన్ కు పేరుండేది.

అజర్ కెప్టెన్సీలో టీమిండియా విజయాల శాతం ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఆ రికార్డును గంగూలీ అధిగమించాడు. విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. గంగూలీ ని ధోనీ సర్ పాస్ చేయగా, ధోనీ సారధ్య రికార్డును కొహ్లీ ఇప్పుడు తన పేరు మీదకు మార్చుకోబోతున్నాడు.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!