నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌ను మార్చే అవకాశాలున్నాయా? అంటే… ఔననే సమాధానం వైసీపీ నాయకుల నుంచి వస్తోంది. నెల్లూరు సిటీ సిటింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అనిల్ స్థానంలో ఆయనకు ఆప్తుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. అయితే నెల్లూరు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణను ఎదుర్కోవడం కష్టమని సర్వేలు జగన్‌కు నివేదించాయి.
ఖలీలే నెల్లూరు అభ్యర్థి అయితే టీడీపీకి అప్పనంగా నెల్లూరు సిటీ సీటును అప్పగించినట్టే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి మార్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు వైసీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఖలీల్‌ను మార్చి, నెల్లూరు ఎంపీ, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సమీప బంధువైన ప్రముఖ కాంట్రాక్టర్‌ను నిలిపే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. నారాయణను ఓడించాలంటే దీటైన అభ్యర్థిని నిలబెట్టడమే మార్గమని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని దెబ్బ కొట్టేందుకు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ చెప్పుడు మాటలు ఆవేశంలో ఖలీల్‌ను అభ్యర్థిగా ప్రకటించారనే చర్చకు తెరలేచింది.
ఖలీల్‌కు మరేదైనా పదవి ఇస్తామనే హామీతో మార్చే ఆలోచన చేస్తున్నట్టు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానుండడంతో మార్చాలని డిసైడ్ అయితే, త్వరగా చేసే అవకాశాలున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం వెలువడినా ఆశ్చర్యపోనవసరం లేదు.