టీడీపీ మరీ అంతలా దిగజారిపోయిందా.?

'కొందరు టీడీపీ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళుతున్న మాట వాస్తవం..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్న మాజీ ఎంపీ, మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీని నిండా…

'కొందరు టీడీపీ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళుతున్న మాట వాస్తవం..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్న మాజీ ఎంపీ, మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసిన నేతల్లో జేసీ దివాకర్‌రెడ్డి ఒకరు. ఇందులో ఇంకోమాటకు తావులేదు. జిల్లాలో ఫ్యాక్షన్‌ రాజకీయాల్ని ప్రోత్సహించడం, అధికారులపై దాడులకు తెగబడ్డం.. ఇలా ఒకటేమిటి.? జేసీ దివాకర్‌రెడ్డి గత ఐదేళ్ళలో చాలా ఘనకార్యాలు చేశారనుకోండి.. అది వేరే విషయం.

జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన కుటుంబం త్వరలో బీజేపీలో చేరబోతోందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, ఆయనే స్వయంగా బీజేపీ విషయమై క్లారిటీ ఇచ్చేశారు. 'నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను.. నన్నెవరు బీజేపీలోకి రమ్మని అడుగుతారు.?' అంటూ అమాయకంగా ఎదురు ప్రశ్నించారు జేసీ దివాకర్‌రెడ్డి. అదే సమయంలో, టీడీపీ నేతలు కొందరు బీజేపీతో టచ్‌లో వున్నారని జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీడీపీ ఉలిక్కిపడింది.

ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ సీట్ల పరంగా ఘోర పరాజయాన్ని చవిచూసినా, ఓట్ల పరంగా మరీ అంత దారుణ పరిస్థితిని అయితే ఎదుర్కోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ తర్వాత టీడీపీనే.. ఇంకో పార్టీ ఇప్పట్లో టీడీపీ స్థాయికి ఎదగడం కూడా దాదాపు అసాధ్యం. అయినాగానీ, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళాలని నేతలు అనుకోవడమేంటి.? ఎటూ, వైఎస్సార్సీపీలోకి సదరు నేతలకు ఎంట్రీ లేకపోవడంతోనే.. వేరే దారి లేక బీజేపీని ఎంచుకుంటున్నారన్నమాట.

పోనీ, ఎంతో కొంతమంది అయినా టీడీపీని వీడి, బీజేపీలో చేరొచ్చుగాక. అలా చేరినవారు, రాజకీయంగా బీజేపీలో నిలదొక్కుకోగలరా.? ఎన్నికల్లో పోటీచేస్తే గెలవగలరా.? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అయినాగానీ, టీడీపీని కాదనుకుని బీజేపీలోకి వెళుతున్నారంటే.. టీడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో అంతలా దిగజారిపోయిందన్నమాట. 'ఓట్ల పరంగా వైసీపీ తర్వాతి స్థానం టీడీపీదే కావొచ్చు. కానీ, భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి ఇంకా దారుణంగా వుండబోతోంది..' అంటూ టీడీపీ ముఖ్యనేత ఒకరు ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!