మునుగోడు అసెంబ్లీ ఎన్నిక విషయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు కొన్ని రొటీన్ రాజకీయ అవకాశాలు కలిసి వస్తున్నట్టుగా ఉన్నాయి. అధికారం సంపాదించుకున్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తమ వ్యతిరేక పక్షాల్లోని అసంతృప్తులను చేర్చుకునే వ్యూహాన్ని అమలు పరుస్తూనే ఉంది. ఇక ఉప ఎన్నికల సందర్భాల్లో టీఆర్ఎస్ ఈ వ్యూహాలపై మరింత శ్రద్ధ చూపుతూ ఉంటుంది.
ఇలాంటి క్రమంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలో కూడా కారు పార్టీకి ఇలాంటి వ్యవహారమే కలిసి వచ్చేలా ఉంది. ఆ పార్టీ కోరుకుంటున్నట్టుగా కొందరు కలిసి వచ్చేలా ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు కొన్ని వలసలు తప్పనట్టుగా ఉన్నాయి.
ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిని ప్రకటించడంతో… టీఆర్ఎస్ కు కాస్త పని దొరికింది. మునుగోడు ఉప ఎన్నికకు పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో… కాంగ్రెస్ లో అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిని టీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుంది. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా టికెట్ ఆశావహులు ఎక్కువ! దీనికి మునుగోడు కూడా మినహాయింపు కాదు.
ఎన్నికలు అనగానే.. నియోజకవర్గ స్థాయి నుంచి పంచాయతీ లెవల్ నేతలు కూడా టికెట్ ను ఆశిస్తారు కాంగ్రెస్ పార్టీలో! ఇలాంటి నేపథ్యంలో మునుగోడులో కూడా చాలా మందే ఆశావహులు తేలారు. ఇలాంటి వారి మధ్యన అభ్యర్థిని తేల్చడం కాంగ్రెస్ కు అంత తేలికైన అంశం కూడా కాదు. అయితే ఎందుకో.. ఈ సారి లేట్ లేకుండా, మునుగోడు అభ్యర్థిత్వాన్ని వేగంగానే తేల్చింది. ఏఐసీసీ నుంచి అభ్యర్థిత్వ ప్రకటన వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వంపై వ్యతిరేకతో ఉన్న వారు, టికెట్ ను ఆశించి భంగపడిన వారిని టీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం, చేర్చుకునే సన్నాహాల్లో ఉన్నట్టుంది.
ఇది వరకూ ఈటల వల్ల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లను చేర్చుకుంది టీఆర్ఎస్. అప్పుడేమో అంత ప్రయోజనం కనిపించలేదు. మరి ఈ సారి ఎలాంటి ప్రయోజనాలుంటాయో!